Panic in Nandigama : నందిగామపై పగబట్టిన వింత రోగం.. ఊపిరి పీల్చుకోవాలన్నా వణుకుతున్న జనం

Panic in Nandigama : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంతుచిక్కని అస్వస్థత కలకలం రేపుతోంది. చందాపురంలో మొదలైన వాంతులు, విరోచనాలు పట్టణమంతా వ్యాపించడంతో అధికారులు హోటళ్లు, మాంసం దుకాణాలు మూయించి హై అలర్ట్ ప్రకటించారు.

CR Reddy
Published on: 2 April 2026 8:15 AM IST
Panic in Nandigama
X

Panic in Nandigama

Panic in Nandigama : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో అంతుచిక్కని అనారోగ్యం కలకలం రేపుతోంది. చందాపురం గ్రామంలో మొదలైన ఈ వింత వ్యాధి లక్షణాలు ఇప్పుడు నందిగామ పట్టణానికి కూడా పాకడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వాంతులు, విరోచనాలతో జనం కుప్పకూలిపోతుండటంతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. రాత్రి వరకు నిక్షేపంగా ఉన్నవాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో విలవిలలాడుతున్నారు. మొదట చందాపురం గ్రామంలో ఒకటి రెండు కేసులుగా మొదలైన ఈ సమస్య, చూస్తుండగానే ఊరంతా పాకింది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 60కి పైగా చేరినట్లు తెలుస్తోంది. బాధితులతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి కిక్కిరిసిపోతోంది. ఈ అస్వస్థత కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా నందిగామ పట్టణంలోని పలు వార్డులకు కూడా విస్తరించడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

హోటళ్లు బంద్.. మాంసం అమ్మకాలు నిలిపివేత

పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు నందిగామలో యుద్ధ ప్రాతిపదికన ఆంక్షలు విధించారు. పట్టణంలోని అన్ని హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. చందాపురం పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందా? లేక తాగునీరు కలుషితం అయ్యిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిండి తినవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

రంగంలోకి వైద్య బృందాలు

అస్వస్థతకు అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ఆహార పదార్థాలు, తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక వస్తేనే ఇది కలరానా లేక ఫుడ్ పాయిజనింగా అన్నది తేలనుంది. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యులు ఇంటింటికీ వెళ్లి ఎవరికైనా అస్వస్థత లక్షణాలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కూడా వెంటనే చికిత్స అందిస్తూ.. పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడుతున్నారు.

శుద్ధి చేసిన నీరే దిక్కు

ప్రస్తుతానికి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని మరిగించి తాగాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పిస్తున్నారు. చిన్నపాటి నలతగా ఉన్నా, వాంతులు అవుతున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. శాంపిల్ రిపోర్టులు వచ్చే వరకు పట్టణంలో ఆంక్షలు కొనసాగుతాయని, ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story