Uyyuru: ఉయ్యూరులో రూ.100 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
Uyyuru: రూ.100 కోట్లతో కృష్ణా తాగునీటి ప్రాజెక్టు పనులకు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. త్వరలోనే టిడ్కో ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Uyyuru: ఉయ్యూరులో రూ.100 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
ఉయ్యూరు: ఉయ్యూరు మున్సిపాలిటీ ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది,మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ బోడే ప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గారు ఉయ్యూరు మున్సిపాలిటీలో సుమారు రూ.100 కోట్లతో చేపట్టనున్న తాగునీటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా రూ.98 కోట్లు, అమృత్-2 పథకం కింద చెరువు అభివృద్ధికి రూ.2 కోట్లు వెచ్చించి మొత్తం సుమారు రూ.100 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ బాలశౌరి గారు మాట్లాడుతూ ప్రజలకు శుద్ధమైన తాగునీరు,మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రహదారులు,వైద్యం,విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కృష్ణా నది నుంచి నీటిని సేకరించి,శుద్ధి చేసి ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు,బోరు నీటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన నదీ జలాలను ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపడుతోందని,సుమారు రెండేళ్లలో పనులు పూర్తి చేసి ప్రజలకు మంచినీటిని అందించగలమనే పూర్తి విశ్వాసం ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు,పనుల నాణ్యత,పురోగతిని ప్రజాప్రతినిధులు,అధికారులు,స్థానిక నాయకులు,ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులను తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు,అమృత్-2,జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా మరిన్ని నిధులు పొందేందుకు అధికారులు సమగ్ర డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సూచించారు.
రానున్న ఒకటి, రెండు నెలల్లో పెనమలూరు నియోజకవర్గానికి సుమారు రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటితో కమ్యూనిటీ హాళ్లు,ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దాదాపు రూ.5,000 కోట్లతో డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జల్ జీవన్ మిషన్,అమృత్ పథకాల నిధులను సమన్వయం చేసి జిల్లాలోని ప్రతి ప్రాంతానికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ నెల 30వ తేదీన సుమారు 1,800 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల కేటాయింపులు చేపట్టే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు.
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ సమగ్ర అభివృద్ధి,టిడ్కో ఇళ్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉయ్యూరు పట్టణ అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతోందని,ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు త్వరలోనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు.
రూ.100 కోట్లతో చేపడుతున్న కృష్ణా తాగునీటి ప్రాజెక్టు ద్వారా తోట్లవల్లూరు నుంచి కృష్ణా నది నీటిని తరలించి,శుద్ధి చేసి ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన టిడ్కో ఇళ్ల వద్ద రోడ్లు,డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి డిసెంబర్ నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు,రాఘవ ఎస్టేట్స్, గండిగుంట ప్రాంతాల్లోని ఇళ్లను కూడా వచ్చే జనవరి–మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.
గత రెండున్నరేళ్లలో ఉయ్యూరు అభివృద్ధికి రూ.45 కోట్లు ఖర్చు చేశామని,HAM పథకం కింద మంజూరైన నిధులతో రాబోయే 2–3 నెలల్లో రోడ్లు,డ్రైన్లు,పార్కుల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని, సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా పథకం అందకపోతే వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఉయ్యూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో ఉయ్యూరును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




