Gudivada: గుడివాడలో రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Gudivada: గుడివాడ రూరల్ మండలంలో రూ.కోటికి పైగా సాస్కి నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.
Gudivada: గుడివాడలో రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Gudivada: గుడివాడ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు శుక్రవారం గుడివాడ రూరల్ మండలంలో కోటి రూపాయల పైగా సాస్కి నిధులతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
లింగవరం గ్రామంలో రూ.71 లక్షల సాస్కి నిధులతో అప్రోచ్ రోడ్డు, మోటూరు గ్రామంలో రూ.40 లక్షల నిధులతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము. లింగవరం గ్రామంలో రూ.3లక్షల ఎస్డిఎస్ విధులతో ఏర్పాటు చేసిన త్రాగునీటి బోర్ ను ప్రారంభించారు.అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు, నాయకులు, మహిళలు, యువత ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నేను ఏ గ్రామానికి వెళ్లినా రోడ్ల సమస్య ప్రధానంగా నా దృష్టికి వస్తుంది. ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. అందుకే అవకాశం ఉన్న ప్రతి పథకం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లను అభివృద్ధి చేస్తున్నామున్నారు.
నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.11 కోట్ల సాస్కి నిధులను తీసుకొచ్చామని... ఈ నిధులతో గ్రామాల్లో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.నియోజకవర్గంలో ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోని అంతర్గత రోడ్ల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఎంత ముఖ్యమో... ప్రజలకు ఎంత చేరువగా ఉండాలన్నది కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కావడం సాధ్యం కాదని... ఆర్థిక పరిస్థితులను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము కోరారు.
“ప్రతి ఒక్కరికీ తమ ప్రాంతంలో ఉన్న సమస్యే అత్యంత ప్రాధాన్యంగా కనిపిస్తుందనీ, నేను ఎక్కడికి వెళ్లినా 20 ఏళ్లుగా మా ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజలు చెబుతున్నారన్నారు.
సమస్యలు ఆకాశమంత తిష్ట వేసుకుని ఉన్నాయనీ, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆలస్యం కావచ్చు... కానీ సమస్యలను మాత్రం తప్పకుండా పరిష్కరిస్తామనీ హామీ ఇచ్చారు.
ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితులను కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలనీ,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. లేకపోతే పరిస్థితిని ఊహించుకోవడానికే భయమేస్తుందనీ ఆందోళన వ్యక్తం చేశారు.అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
“నేను ఏ గ్రామానికి వెళ్లినా ఒకటే చెబుతున్నాను, అందరం అభివృద్ధిని కోరుకుందాం... రాజకీయాలు వద్దనీ, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందామని ,కానీ గ్రామాభివృద్ధి విషయంలో అందరం కలిసి ముందుకు సాగాలనీ పిలుపునిచ్చారు.
అందరం ఐక్యంగా ఉంటేనే మన ప్రాంతానికి మరిన్ని నిధులు తీసుకురాగలమని,అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసుకోగలమని ఆయన అన్నారు. ప్రజలందరి సహకారం ఉంటే గుడివాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయగలమని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు.మోటూరు గ్రామ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాము.
మోటూరు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన ఎమ్మెల్యే రాము... గ్రామ చెరువు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో రాజకీయాలకు తావివ్వకుండా సహకరించాలని కోరారు.గత ప్రభుత్వంలో మోటూరులో కోట్లాది రూపాయల మట్టి దోపిడీ జరిగిందనీ,ఎన్నో అరాచకాలు జరిగాయనీ ఆ విషయం గ్రామంలోని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం కాదు... మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదే మన ముందున్న లక్ష్యమన్నారు .ఊరి చెరువును బాగు చేద్దామని, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు చేపడదామని ప్రయత్నిస్తుంటే కొందరు రాజకీయ ఉద్దేశంతో అడ్డుకుంటున్నారనీ చెప్పారు.
నేను గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాననీ,ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాననీ పేర్కొన్నారు. కానీ రాజకీయాలే ప్రాధాన్యమని భావించే కొందరి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదన్నారు.ప్రజలందరూ ఐక్యంగా ఉండి అలాంటి అడ్డంకులను తిప్పికొట్టాలనీ,మన గ్రామానికి ఏది మంచిదో ఆలోచించి అందరం కలిసి ముందుకు సాగాలనీ విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, బసవయ్య, కుటుంబరావు, సురగని సూరిబాబు, దొండపాటి మహేష్,JSP గంగాధర్, లింగవరం నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షుడు మార్క్ రాజ్, చిరంజీవి రెడ్డి, గోపాల స్వామి, ధర్మ తారక రామారావు, కాటూరి ఏసుపాదం, కలపాల మాణిక్యాలరావు, కొత్తకోట నాగరాజు, P. శ్రీను,T. మురళీ, మోటూరు నాయకులు గ్రామ అధ్యక్షులు చీకటి శేషగిరిరావు, గొర్రె రంగా, మానేపల్లి సురేష్, దగ్గుమిల్లి బద్రి,పాండు, రోహిణి, AVR నాయుడు, గంటా నాగరాజు, చలమల శెట్టి సాయి, గంటా చైతన్య, శనక్కాయలు జనార్దన్ రావు, ప్రభుత్వ అధికారులు పంచాయతీరాజ్ DE కిరణ్,AE సూరిబాబు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




