Uyyuru: ఉయ్యూరులో పారిశుధ్య లోపం: విరోచనాల బారిన బాధితుడు!

Uyyuru: ఉయ్యూరులో తీవ్ర పారిశుధ్య లోపం కారణంగా వ్యక్తి వాంతులు విరోచనాల బారిన పడటంపై స్థానికుల ఆగ్రహం. నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల తీవ్ర అసంతృప్తి.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 10:05 AM IST
Uyyuru
X

Uyyuru: ఉయ్యూరులో పారిశుధ్య లోపం: విరోచనాల బారిన బాధితుడు!

Uyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని కాపుల రామాలయం వీధిలో పారిశుధ్యం పూర్తిగా మృగ్యమైంది. శనివారం ఉదయం ఈ వీధికి చెందిన ఒక వ్యక్తి తీవ్రమైన వాంతులు, విరోచనాల బారిన పడ్డారు.

పరిస్థితి విషమించడంతో బాధితుడు స్థానిక ఆర్‌ఎంపీ (RMP) వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స పొందుతూ ఇంటి వద్దనే కోలుకుంటున్నారు. స్థానికంగా తాగునీరు కలుషితం కావడం లేదా వీధుల్లో పెరిగిన చెత్తాచెదారమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రజాప్రతినిధుల హడావుడి.. క్షేత్రస్థాయిలో పూజ్యం

ఘటన స్థలానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కేవలం పరామర్శలకే పరిమితమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే గారు వీధిని సందర్శించి హడావుడి చేసి వెళ్లారే తప్ప, సమస్య శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. అధికారులను అప్రమత్తం చేసి పరిసరాలను శుభ్రం చేయించాల్సింది పోయి, చేతులు దులుపుకుని వెళ్లిపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కనీసం చెత్త కూడా ఎత్తని నగర పంచాయతీ

నగర పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం ఈ ఘటనతో మరోసారి బయటపడింది. వీధిలో వ్యాధి తీవ్రత నమోదైనప్పటికీ, అధికారులు కనీస స్పందన కనబరచలేదు. ఈరోజు ఉదయం కూడా కాపుల రామాలయం వీధిలో చెత్తను సేకరించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. దోమల వ్యాప్తి, మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల మరింత మంది అనారోగ్యంబారిన పడే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కాపుల రామాలయం వీధిలో బ్లీచింగ్ చల్లి, కలుషిత నీటి సరఫరాను అరికట్టాలని, అలాగే పారిశుధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఉయ్యూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story