Kankipadu: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు - కలెక్టర్ బాలాజి

Kankipadu: కంకిపాడులో నిర్వహించిన కిసాన్ మేళాలో కలెక్టర్ డికె బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు.

Ramana, Penamaluru
Published on: 2 Sept 2026 9:01 PM IST
Kankipadu
X

Kankipadu: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు - కలెక్టర్ బాలాజి

కంకిపాడు: ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకుంటున్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పంట నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

కంకిపాడు మండలంలోని శ్రీకృష్ణ కళ్యాణ వేదికలో బుధవారం కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ (ATMA) సౌజన్యంతో నిర్వహించిన అగ్రి ఎక్స్‌పో–కిసాన్ మేళా–2026లో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది అధిక వర్షాల కారణంగా పంట నష్టం సంభవించిందని, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నాట్లు వేయడం ఆలస్యమైందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు, యాజమాన్య విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అధిక మోతాదులో ఎరువులు వినియోగించడం వల్ల భూమి నిర్మాణం, స్వభావంలో మార్పులు వచ్చి వేరు వ్యవస్థ బలహీనపడటంతో పాటు సూక్ష్మజీవుల వృద్ధి తగ్గిపోతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టిన పొలాల్లో పంట నష్ట పరిమితి తక్కువగా ఉండటంతో పాటు వేరు వ్యవస్థ, భూమి ఆరోగ్యం మెరుగ్గా ఉండటం, వానపాములు, సూక్ష్మజీవుల సంఖ్య అధికంగా ఉండటం గమనించామని చెప్పారు.

రైతులు అవసరమైన మోతాదులో మాత్రమే ఎరువులు వినియోగించాలని, తద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రానున్న రబీ సీజన్‌లో నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా మినుము విత్తనాలను తగిన విధంగా సిద్ధం చేసుకుని విత్తుకోవాలని తెలిపారు. పిఎండిఎస్ విధానాన్ని అవలంబించడంతో పాటు ఎల్-షేప్ బండ్లు ఏర్పాటు చేసుకుని వరితో పాటు ఇతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ పథకాలను అందిస్తున్నందున రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు

పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అగ్రి ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన యాంత్రీకరణ, ఎరువులు, ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఎల్నినో కారణంగా పంట నష్టం సంభవించే పరిస్థితుల్లో రైతులు పీఎం ఎఫ్బి వై పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్ తోటల్లో స్వల్పకాలిక పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

కార్యక్రమంలో రైతులు–శాస్త్రవేత్తల ముఖాముఖి నిర్వహించి వరి, మినుము, శనగ పంటల సాగు, నూతన వంగడాలు, ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు అందించారు. శాస్త్రవేత్తలు మినుము సాగులో ఎకరానికి 16–20 కిలోల విత్తనం మాత్రమే వినియోగించాలని, ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలని సూచించారు. అగ్రి ఎక్స్‌పోలో వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, బయోఫెర్టిలైజర్లు, పురుగుమందులు తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కే జ్యోతి రమణి, కంకిపాడు, గుడివాడ, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు ధన కోటేశ్వరరావు, కే ప్రసాద్ రావు, కొండ ప్రవీణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ సి రవీంద్రారెడ్డి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, స్టేట్ అగ్రిమిషన్ ప్రతినిధులు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story