Vuyyuru: ఉయ్యూరులో డయేరియా కలకలం నీరు, ఆహార నమూనాలు సేకరణ!

Vuyyuru: ఉయ్యూరులో డయేరియా లక్షణాలు ప్రబలడంతో అధికారులు అప్రమత్తం. నీరు, హోటల్ ఆహార నమూనాల సేకరణ, ఎన్ఏబీఎల్ ల్యాబ్‌కు తరలింపు.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 12:59 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో డయేరియా కలకలం నీరు, ఆహార నమూనాలు సేకరణ!

Vuyyuru: ఉయ్యూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు వాంతులు, విరేచనాలు వంటి డయేరియా లక్షణాలతో వైద్య సేవలు పొందుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణాజిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ అధికారులు సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

డయేరియా లక్షణాలు ప్రబలడానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉయ్యూరు, పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి నేతృత్వంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాధితుల ఇళ్ల పరిసర ప్రాంతాల నుంచి 4 నీటి నమూనాలు, సమీపంలోని హోటళ్ల నుంచి 5 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. ఈ నమూనాలను విశ్లేషణ కోసం చెన్నైలోని NABL గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం ఆహారం, నీటి నాణ్యతకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తనిఖీల సందర్భంగా నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ ఉపయోగించి తయారు చేసిన సుమారు 10 కిలోల గోబీ మంచూరియన్, చికెన్ వంటకాలను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా హోటల్ నిర్వహిస్తున్న ఒక వ్యాపార సంస్థకు నోటీసు జారీ చేశారు.

ప్రజలకు సురక్షితమైన ఆహారం, తాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఉయ్యూరు, పరిసర గ్రామాల్లో రానున్న 7 నుంచి 10 రోజుల పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించనున్నారు. అనుమానాస్పద ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు.

డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరిగించి చల్లార్చిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని, ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు.

నీరు, ఆహార నమూనాల ప్రయోగశాల పరీక్షల ఫలితాలు అందిన అనంతరం మాత్రమే అనారోగ్యానికి ఖచ్చితమైన కారణంపై నిర్ధారణకు రావచ్చని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story