A Konduru: రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

A Konduru: కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Updated on: 29 Aug 2026 7:35 PM IST
A Konduru
X

A Konduru: రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

ఏ.కొండూరు: కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, వారి గోడు పట్టించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన మందులు, స్వచ్ఛమైన తాగునీరు, ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం,

చైతన్యనగర్ తండాలో ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాణావత్ హనుమ కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, సి.హెచ్.బాబురావు లతో కలిసి శనివారం పరామర్శించారు. అనంతరం తండాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పలువురిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా అందుతున్న వైద్య సేవలు, మందులు, డయాలసిస్ సదుపాయాలు, పెన్షన్ తదితర అంశాలపై బాధితులతో మాట్లాడారు.

ఈసందర్భంగా కిడ్నీ బాధితులు తమకు సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు తరచూ రంగు మారి మురుగునీరులా ఉంటున్నాయని శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కంటి తుడుపు చర్యగా కృష్ణా జలాల సరఫరా, మందులు, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు.

అన్ని రకాల అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డయాలసిస్ చేయించుకునే వారికి మాత్రమే పెన్షన్ అందిస్తున్నారని, కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి బాధితుడికీ పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వ్యాధి కారణంగా పని చేయలేక, ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది బాధితులు జీవనం సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించడంతో పాటు వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించేవారని, ప్రస్తుతం ఆ సదుపాయాలు కూడా బాధితులకు అందడం లేదని శ్రీనివాసరావు అన్నారు.

కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ట్యాంకులను నిర్మించి శుద్ధి చేసిన కృష్ణా జలాలను ప్రజలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు ఆయా కుటుంబాలకు రెండు ఎకరాల భూమి మంజూరు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పి.ఆనందరావు, నాయకులు జె. వెంకటేశ్వరరావు, ఎం.నాగరాజు, పి. ముర ళీకృష్ణ, జె. ఏడుకొండలు, ఎస్. చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story