Yellandu: ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి - గోవర్ధన్
Yellandu: ఖమ్మంలో సెప్టెంబర్ 28-30 తేదీల్లో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కే.గోవర్ధన్ ఇల్లందులో పిలుపునిచ్చారు.
Yellandu: ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి - గోవర్ధన్
ఇల్లందు: సెప్టెంబర్ 28,29,30 తేదీలలో ఖమ్మం నగరంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కె ఎమ్ ఎస్) జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే.గోవర్ధన్ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఇల్లందు పాత బస్టాండ్ లో గల అయితా ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఏఐకేఎంఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతు దేశానికి వెన్నెముక అంటూ,రైతు లేనిదే దేశం లేదని చెబుతూ భారత పాలకులు రైతుల నడ్డి విరిస్తున్నారని విమర్శించారు.
రైతుల ఆదాయం 2020కి రెట్టింపు చేస్తామన్న మోడీ వాగ్దానం గాలికి ఎగిరిపోయిందని అన్నారు. 12సంవత్సరాల మోడీ పాలనలో రైతుల నిజ ఆదాయం1.4 శాతం,వ్యవసాయ కూలీల నిజ వేతనాలు 0.6 శాతానికి తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయంటే రైతు కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం పంటలకు కనీసం మద్దతు ధర ఇస్తామని 2014నాటి ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసి నేటికీ అమలు చేయకుండా రైతాంగానికి ద్రోహం చేసిందని విమర్శించారు. దీనితో రైతాంగం అప్పుల ఊబిలో కూరకపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2025 విద్యుత్ సవరణ బిల్లును,విత్తన చట్ట బిల్లును,అటవీ సంరక్షణ చట్టం సవరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద,కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకువస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్తి వెంకటేశ్వర్లు,తుపాకుల నాగేశ్వరరావు,గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు,ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి, నాయకులు ఎస్.కె. ఉమర్,పూనెం రంగన్న,పూణెం కోటయ్య,జె. సీతారామయ్య,ముక్తి సత్యం,కొక్కు సారంగపాణి,ఎండి. రాసుద్దిన్,డి. ప్రసాద్,ఆదిలక్ష్మి,ముసలి సతీష్,గడ్డం లాలయ్య, జి.రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.




