Khammam: తలసేమియా చిన్నారుల కోసం ఎర్రబడ్డ ఖమ్మం: ‘లైట్ అప్ రెడ్’తో ఘనంగా ప్రపంచ తలసేమియా దినోత్సవం!
Khammam: ఖమ్మంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల క్యాంపు ఆఫీసు సహా పలు భవనాలు ఎరుపు రంగులో మెరిశాయి. తుమ్మల యుగంధర్, డాక్టర్ ప్రదీప్ కుమార్ రక్తదానం చేసి చిన్నారులకు అండగా నిలిచారు.
Khammam: తలసేమియా చిన్నారుల కోసం ఎర్రబడ్డ ఖమ్మం: ‘లైట్ అప్ రెడ్’తో ఘనంగా ప్రపంచ తలసేమియా దినోత్సవం!
ఖమ్మం: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు మేమంతా ఉన్నామంటూ ఖమ్మం నగరం గొంతు కలిపింది. టీఎస్ సీఎస్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం నగరం ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమంలో భాగంగా శుక్ర, శనివారాల్లో రాత్రి వేళల్లో తలసేమియా చిన్నారులకు భరోసాగా నిలిచేందుకు పలు భవనాలు ఎరుపు వెలుగులు విరజిమ్మాయి.
* ఎరుపు రంగు విద్యుత్ కాంతుల్లో భవనాలు
ఖమ్మంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం, డాక్టర్ కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీఎస్ సీఎస్ బిల్డింగ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల భవనాలు ఎరుపు రంగు విద్యుత్కాంతులతో తలసేమియా చిన్నారులకు మేము సైతం భరోసాగా నిలుస్తాం అంటూ వెలుగులు విరజిమ్మాయి.
* ఆత్మీయంగా వేడుకలు..
ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను తలసేమియా సొసైటీలో డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన ఆటపాట, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా, ‘ఖమ్మం టెడ్డి టీం’ చిన్నారులతో కలిసి ఆడిపాడి వారిని అలరించారు.
* రక్తదానంతో స్ఫూర్తి
ప్రపంచ తలసీమియా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో తుమ్మల యుగంధర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. వీరితో పాటు ‘యువం ఫౌండేషన్’ సభ్యులు సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు.
తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ
గత 13 ఏళ్లుగా డాక్టర్ ప్రదీప్ కుమార్ తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. చిన్నారులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు, రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రతి నెలా రక్తాన్ని అందిస్తూ వారికి ఆత్మబంధువుగా నిలిచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో నేను కూడా ప్రతి ఏడాది రక్తదానం చేస్తానని ప్రకటించారు. ఖమ్మం నుండే మొదటి అడుగు వేసేలా ప్రభుత్వం హెచ్‌బీ ఏ2 పరీక్షలు నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. అతిథులు ఖమ్మం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రెహనా బేగం, సెక్రటరీ డాక్టర్ కోటేశ్వరరావు, ట్రెజరర్ డాక్టర్ కూరపాటి ప్రీతి మాట్లాడుతూ తలసేమియా బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ చేస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీఎస్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సనాఉల్లా,డాక్టర్ సిద్ధార్థ్, వాలంటీర్లు నరేష్, అభిషేక్, మల్లేష్ , నజీర్, మోతిలాల్, సిరాజ్ ,సుచరిత,లక్ష్మి, సుగుణ, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.




