Kothagudem: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kothagudem: రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Kothagudem: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kothagudem: తడిసిన ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు.
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పడిన పరిస్థితులపై సమీక్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి నష్టం కలిగించే ఎటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇప్పటివరకు రూ.10,097 కోట్లు చెల్లించామని, దీని ద్వారా 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాల ధాన్యం కాగా, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాల ధాన్యమని వివరించారు.
ఇసుక సరఫరాకు వినియోగించే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి, సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రికార్డు స్థాయిలో కొనుగోళ్లు నిర్వహిస్తుంటే, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం కొనుగోళ్ల ప్రక్రియపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతాంగానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు.




