Kothagudem: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి
Kothagudem: తెలంగాణలో తొలిసారిగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ల రూపకల్పన. డేటా నాణ్యత, ఖచ్చితత్వానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సంచాలకులు భారతి హోళీ కేరి ఆదేశం.
Kothagudem: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి
కొత్తగూడెం: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ)ను అత్యంత ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జనగణన సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్) భారతి హోళీ కేరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు ప్రత్యేక హ్యాండ్‌బుక్‌లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో జనాభా, సామాజిక, ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తామని తెలిపారు. భవిష్యత్ ప్రభుత్వ విధానాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలు, పరిశోధనలు, జనగణన విశ్లేషణలకు ఈ హ్యాండ్‌బుక్ ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రతి శాఖ నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ గ్రామం, పట్టణ స్థాయి వరకు పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. 2025 డిసెంబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సౌకర్యాలు, శాఖల అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గృహాల జాబితా సేకరణ అనంతరం జనాభా గణాంకాలను జాతీయ స్థాయిలో విశ్లేషించి అధికారికంగా ప్రచురిస్తారని తెలిపారు.
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచే ప్రతి సమాచారం సంబంధిత శాఖల అధికారిక నమోదుల ఆధారంగా మాత్రమే ఉండాలని, సమాచారం సంపూర్ణంగా, ఖచ్చితంగా, ఏకరూపంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆగస్టు 10 నుంచి 21 వరకు సమాచార సేకరణ చేపట్టాలని, జిల్లా స్థాయిలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి శాఖకు బాధ్యతలు కేటాయించాలని ఆదేశించారు. శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించి, అవసరమైన నమూనా పట్టికలను ముందుగానే అందించాలని సూచించారు.
అన్ని శాఖలు ఒకే నిర్ధారిత తేదీని ప్రామాణికంగా తీసుకొని సమాచారాన్ని అందించాలని, అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించాలని, అన్ని శాఖల్లో గణాంకాల ఏకరూపత పాటించాలని ఆదేశించారు.
ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 8 వరకు సమాచార నమోదు, పరస్పర పరిశీలన చేపట్టాలని సూచించారు. ప్రతి పట్టికను సంబంధిత శాఖాధికారి, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ విభాగం రెండుసార్లు పరిశీలించాలని తెలిపారు. ప్రతికూల విలువలు, ఖాళీ గడులు, పునరావృత నమోదులు లేకుండా చూసి, మొత్తాలు, ఉపమొత్తాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించాలని సూచించారు. గత జనగణన గణాంకాలు, ప్రస్తుత శాఖల సమాచారాన్ని పోల్చి అసాధారణ వ్యత్యాసాలు ఉంటే వాటికి కారణాలు నమోదు చేయాలని తెలిపారు.
నిర్దేశించిన నమూనా పట్టికలను మాత్రమే ఉపయోగించాలని, టైపింగ్ పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, పదాల అక్షరక్రమంలో ఏకరూపత పాటించాలని సూచించారు. గ్రామాల పేర్లు అధికారిక రెవెన్యూ నమోదుల ప్రకారమే నమోదు చేయాలని, సంకేత సంఖ్యల్లో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 8లోపు జిల్లా సమగ్ర పరిచయాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ఇందులో జిల్లా పరిచయం, భౌగోళిక స్వరూపం, పరిపాలనా నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి సూచికలు, జిల్లాకు సంబంధించిన ప్రత్యేక విశేషాలను పొందుపరచాలని సూచించారు.
సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు సమాచార ధృవీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పట్టికలో అన్ని గడులు పూర్తిగా నింపబడ్డాయా, మొత్తాలు సరిగా ఉన్నాయా, శాఖల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలున్నాయా, వివరణాత్మక సమాచారం గణాంకాలకు అనుగుణంగా ఉందా, తేదీలు సక్రమంగా నమోదయ్యాయా, అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే వివరాలు నమోదు చేశారా, పటాల అనుసంధానం సక్రమంగా ఉందా అనే అంశాలను బాధ్యతాధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.
ప్రతి సమాచారం ప్రామాణికత, ఖచ్చితత్వం, తాజాదనం, సంపూర్ణత, ఏకరూపత అనే ఐదు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రతి దశ పూర్తయిన తర్వాత అంతర్గత నాణ్యత తనిఖీ నిర్వహించి, ప్రతి సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను భద్రపరచాలని తెలిపారు. అన్ని అభ్యంతరాలను పరిష్కరించి, బాధ్యతాధికారి ధృవీకరణ అనంతరం మాత్రమే జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ పార్ట్–ఎను నిర్ణీత గడువులో రాష్ట్ర జనగణన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జనగణన సంచాలకులు ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరించి, పూర్తిస్థాయిలో పరిశీలన, ధృవీకరణ అనంతరం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌కు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపట్టిక ప్రకారం రాష్ట్ర జనగణన కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పి సీఈవో నాగలక్ష్మి, ప్రణాళికాధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




