Kothagudem: సింగరేణిలో నెలకు 3 మెడికల్ బోర్డులు పెట్టాలి: టీబీజీకేఎస్!

Kothagudem: సింగరేణిలో ప్రతినెలా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులైన కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో TBGKS నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Sept 2026 5:06 PM IST
Kothagudem
X

Kothagudem: సింగరేణిలో నెలకు 3 మెడికల్ బోర్డులు పెట్టాలి: టీబీజీకేఎస్!

కొత్తగూడెం: సింగరేణిలో ప్రతి నెల క్రమం తప్పకుండా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి, అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కొత్తగూడెం ఏరియాలో వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా TBGKS రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మాట్లాడుతూ.. 1998లో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టడంతో వేలాది కార్మిక కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఇప్పటికీ అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న వారిలో అధిక శాతం కార్మికులు మెడికల్ అన్‌ఫిట్ అవుతున్నారని కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు విమర్శించాయని కాపు కృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నెల కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని, అర్హులైన దరఖాస్తుదారులను 100 శాతం మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తామని హామీలు ఇచ్చారని ఆరోపించారు.

అయితే ప్రస్తుతం బోర్డుల నిర్వహణలో జాప్యం జరుగుతోందని, అర్హులైన కార్మికులు నెలల తరబడి ఎదురు చూస్తుండటంతో వారి సర్వీసు కాలం పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిరంతరాయంగా నిర్వహించి, వైద్యపరంగా అర్హత ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం మైన్ మేనేజర్లు, సంబంధిత విభాగాల హెచ్‌ఓడీలకు కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గడప రాజయ్య, కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, సంతోష్, నిశాంత్, నమిల్ల వెంకటేశ్వర్లు, అలీమ్ పాషా, వినీత్, అజీజ్, అజీమ్, బాలాజీ, అన్వర్ పాషా, నవీన్, శంకర్, వెంకట్రావు, అనుదీప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story