Kothagudem: యువకుడిపై దాడి చేసి ఫోన్‌పేలో డబ్బులు లాక్కున్న ముఠా అరెస్ట్!

Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో యువకుడిపై దాడి చేసి ఫోన్‌పే ద్వారా నగదు దోచుకున్న ఆరుగురి అరెస్ట్. 4 ఫోన్లు, రూ.13 వేలు స్వాధీనం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Sept 2026 4:20 PM IST
Kothagudem
X

Kothagudem: యువకుడిపై దాడి చేసి ఫోన్‌పేలో డబ్బులు లాక్కున్న ముఠా అరెస్ట్!

Kothagudem: యువకుడిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి, సెల్‌ఫోన్ లాక్కొని అతని ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసుకున్న కేసును లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం ఆగస్టు 30న బాధిత యువకుడిని నిందితుల్లో ఒకరైన బానోత్ అభిలాష్ నమ్మించి బైక్‌పై శ్రీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే వేచి ఉన్న మరో ఐదుగురు నిందితులు యువకుడిపై దాడి చేసి అతని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం ఫోన్ పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు చెప్పాలని బెదిరించి. వివిధ ఫోన్‌పే ఖాతాలకు మొత్తం రూ.31 వేల నగదును బదిలీ చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో బానోత్ అభిలాష్, పరదేశి శ్రీరామ్, గుగులోతు చరణ్ అలియాస్ చరణ్ తేజ్, చిక్కుళ్ల వరుణ్ తేజ్, తేజావత్ విఘ్నేష్, జగతాని ఉపాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులంతా స్నేహితులేనని, మద్యం తదితర చెడు అలవాట్లకు డబ్బులు అవసరమై అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి ముందస్తు ప్రణాళిక రూపొందించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, IPS సూచించారు. కేసును ఛేదించిన లక్ష్మీదేవిపల్లి పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM