Kothagudem: ఆగస్టు 18న సీతారామ ప్రాజెక్టుల పరిశీలన: సీపీఎం!

Kothagudem: ఆగస్టు 18న సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పరిశీలనకు సీపీఎం పిలుపు. రైతులకు ఇచ్చిన హామీలపై నిలదీత.. కొత్తగూడెంలో మచ్చా వెంకటేశ్వర్లు ధ్వజం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Aug 2026 3:36 PM IST
Kothagudem
X

Kothagudem: ఆగస్టు 18న సీతారామ ప్రాజెక్టుల పరిశీలన: సీపీఎం!

Kothagudem: సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపు, చెరువుల అనుసంధానం తదితర అంశాలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు ఆగస్టు 18న సీపీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రాజెక్టుల పరిశీలన చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు.

స్థానిక మంచికంటి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి తుమ్మల చెరువుకు సీతారామ కాలువ ద్వారా నీటిని అందించి 7.89 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఆచరణలో నెరవేరలేదని విమర్శించారు. మంత్రుల హామీలను నమ్మి నార్లు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు.

ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించకుండా ప్రచారానికి పరిమితమవుతోందని ఆరోపించారు. మూడు జిల్లాల రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

సీతమ్మ సాగర్ బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణమే ముందుకు సాగకపోతే సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 413 చెరువులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.

జిల్లాకు సమగ్ర సాగునీటి ప్రణాళికను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలిపారు. పాత డీపీఆర్ ప్రకారం కిన్నెరసాని, రోళ్లపాడు, బయ్యారం చెరువులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. ఆగస్టు 18న చేపట్టనున్న ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో అశ్వాపురం, బూర్గంపాడు, ములకలపల్లి, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కె. బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story