Singareni: సింగరేణి చరిత్రలో ప్రత్యేక మైలురాయి: SRP-1 గనికి 50 ఏళ్లు!
Singareni: సింగరేణి శ్రీరాంపూర్ SRP-1 గని స్వర్ణోత్సవాలు. 50 ఏళ్ల ప్రస్థానంలో రికార్డు స్థాయి ఉత్పత్తి, భద్రతకు పెద్దపీట. మరో 4 ఏళ్ల ఆయువు పొడిగింపు.
Singareni: సింగరేణి చరిత్రలో ప్రత్యేక మైలురాయి: SRP-1 గనికి 50 ఏళ్లు!
Singareni: సింగరేణి అంటే కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు.. లక్షలాది కుటుంబాలకు కన్నతల్లి. అలాంటి సింగరేణి చరిత్రలో శ్రీరాంపూర్ SRP-1 గనిది ప్రత్యేక స్థానం.1976 సెప్టెంబర్ 2న పురుడు పోసుకున్న ఈ గని.. 1978లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి నేటి వరకు అప్రతిహతంగా కొనసాగుతూ.. శ్రీరాంపూర్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. యాభై వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాల్లోకి అడుగుపెడుతోంది.
శ్రీరాంపూర్ ఉద్యోగుల తొలి ఉపాధి కేంద్రం.. బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియా ఆవిర్భావానికి తొలి అడుగు.1976 సెప్టెంబర్ 2న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు చేతుల మీదుగా SRP-1 గనికి అంకురార్పణ జరిగింది. రెండేళ్ల తర్వాత 1978లో బొగ్గు వెలికితీత ప్రారంభమైంది. అప్పటి నుంచి విద్యుత్ అవసరాలకు కావాల్సిన బొగ్గును అందిస్తూ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
167 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న SRP-1 గనిలో.. 16 హెక్టార్లు అటవీ భూమి. గనిలో భౌగోళిక బొగ్గు నిల్వలు 25.42 మిలియన్ టన్నులు.గని ప్రారంభమైన రోజుల్లో శ్రీరాంపూర్ ఒక చిన్న వ్యవసాయ ఆధారిత గ్రామం. కనీస మౌలిక వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. విద్య, వైద్యం సదుపాయాలు పరిమితంగా ఉండేవి.అయితే SRP-1 రాకతో పరిస్థితులు మారిపోయాయి. స్థానికులకు సింగరేణి ఉద్యోగాలు లభించాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. శ్రీరాంపూర్ క్రమంగా పట్టణంగా రూపుదిద్దుకుంది. వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు విస్తరించాయి. జనాభా పెరిగింది. కాలనీలు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, కళాశాలలు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
సింగరేణి విద్యాసంస్థలు వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాయి. ఇక్కడ అక్షరాలు దిద్దుకున్న ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలుగా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు.
కార్మికుల కష్టానికి సాంకేతికత తోడు అత్యంత అధిక గ్రేడియంట్ ఉన్న SRP-1 గనిలో.. ప్రారంభమైన నాటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వేలాది మంది కార్మికులు కాలినడకన భూగర్భంలోకి వెళ్లి సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉత్పత్తికి బాటలు వేశారు.
కార్మికుల శ్రమను తగ్గించేందుకు 2012లో మ్యాన్ రైడింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో భూగర్భంలో పని ప్రదేశాలకు చేరుకునే సమయం గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం ఉత్పత్తిపైనా కనిపించింది.
ఆ తర్వాత 2014లో SRP-1లో SDL యంత్రాల ప్రవేశం మరో మైలురాయిగా నిలిచింది. అత్యంత గ్రేడియంట్ ఉన్న గనిలో SDLలతో బొగ్గు ఉత్పత్తి చేపట్టడం సింగరేణిలోనే ఒక రికార్డుగా నిలిచింది. కార్మికుల శారీరక శ్రమ తగ్గడమే కాదు.. ఉత్పత్తిలోనూ రికార్డులు నమోదయ్యాయి.
2014లో 105 శాతం,
2016లో 105 శాతం,
2017లో 100 శాతం,
2018లో 102 శాతం,
2019లో ఏకంగా 135 శాతం,
2020లో 103 శాతం,
2021లో 101 శాతం,
2022లో 102 శాతం,
2023లో రికార్డు స్థాయిలో 200 శాతం,
2024లో 104 శాతం,
2025లో 104 శాతం ఉత్పత్తి సాధించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 116 శాతం ఉత్పత్తితో SRP-1 దూసుకుపోతోంది.
కార్మికుడి నుంచి డైరెక్టర్ వరకు..
SRP-1లో కార్మికులుగా భూగర్భంలో విధులు ప్రారంభించిన పలువురు.. సంస్థ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అధికారులుగా, జనరల్ మేనేజర్లుగా, డైరెక్టర్లుగా ఎదిగారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ స్థాయి నుంచి GM, డైరెక్టర్ స్థాయికి ఎదిగిన వారూ ఉన్నారు.
కార్మికుడి కష్టానికి.. సింగరేణి కల్పించే అవకాశాలకు SRP-1 ఒక సజీవ ఉదాహరణ. భద్రతలోనూ ముందంజ బొగ్గు ఉత్పత్తి సంస్థలకు అత్యంత కీలకమైన భద్రత, రక్షణ విషయంలోనూ SRP-1 ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.కంపెనీ నిబంధనలు, భద్రతా సూత్రాలను పాటిస్తూ..
రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 50, 51, 52వ వార్షిక భద్రతా పక్షోత్సవాల్లో వరుసగా బహుమతులు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇటీవల జరిగిన 56వ వార్షిక భద్రతా వారోత్సవాల్లో గ్రూప్-4 గనుల్లో మొదటి బహుమతి సాధించింది.
అంతేకాదు.. జాతీయ స్థాయిలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన రేటింగ్స్‌లో 2018-19 సంవత్సరానికి ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి సింగరేణి సంస్థతో పాటు శ్రీరాంపూర్ ఏరియాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.
8.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 1978 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు SRP-1 గని నుంచి దాదాపు 8.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఈ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతూ.. రాష్ట్రం, దేశ అభివృద్ధిలో SRP-1 తనవంతు పాత్ర పోషించింది.
ఉత్పత్తి.. ఉత్పాదకత.. భద్రత.. సాంకేతికత.. సంక్షేమం.. అన్ని రంగాల్లోనూ SRP-1 తనదైన ముద్ర వేసుకుంది. మూసివేత అంచుల నుంచి మరో నాలుగేళ్ల జీవితం 2025లో SRP-1 గని ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గని మూతపడుతుందన్న ఆందోళన ఉద్యోగులు, వారి కుటుంబాలు, స్థానికుల్లో నెలకొంది.
అయితే శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, గని ఏజెంట్ రవికుమార్, మేనేజర్ ఆత్మారాం సహాని, ఇతర అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మూసివేసిన సీమ్స్‌ను తిరిగి ప్రారంభించే అవకాశాలపై అధ్యయనం చేశారు.
ఆ అధ్యయనం ఫలితంగా 2026లో సీమ్-1ను తిరిగి ప్రారంభించడంతో పాటు సీమ్-1, సీమ్-2 ఉత్తర భాగంలో మిగిలిన బొగ్గును వెలికితీయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో గని జీవితకాలం మరో 3 నుంచి 4 సంవత్సరాలు పెరిగింది.
ఇది వందలాది మంది ప్రత్యక్ష ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా.. పరోక్షంగా వేలాది మందికి భరోసా కల్పిస్తోంది. నివాస ప్రాంతాల కింద.. అత్యంత జాగ్రత్తగా ఉత్పత్తి
నివాస ప్రాంతాల కింద SRP-1 గని ఉత్పత్తి కొనసాగుతున్నప్పటికీ.. డీజీఎంఎస్ అనుమతులు, మార్గదర్శకాలకు లోబడి అత్యంత భద్రతతో బొగ్గు ఉత్పత్తి కొనసాగిస్తోంది. యాభై ఏళ్ల ఘన వారసత్వం 1976లో అంకురార్పణ.. 1978లో ఉత్పత్తి ప్రారంభం.. 2026లో స్వర్ణోత్సవాలు..
యాభై ఏళ్లుగా శ్రీరాంపూర్ జీవితాల్లో వెలుగులు నింపుతున్న SRP-1.. కేవలం ఒక గని కాదు.. ఓ ప్రాంత అభివృద్ధికి పునాది.. వేలాది కుటుంబాలకు జీవనాధారం.. తరతరాల సింగరేణి కార్మికుల కష్టానికి ప్రతీక. అంకితభావానికి.. కృషికి.. ప్రగతికి ప్రతీకగా నిలుస్తూ. 50 ఏళ్ల అప్రతిహత వారసత్వంతో.. భావితరాల సింగరేణి ఉద్యోగులకు SRP-1 స్ఫూర్తిగా నిలుస్తోంది.
గని స్వర్ణోత్సవాల సందర్భంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ గౌతం పొట్రు, డైరెక్టర్ (పీపీ) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఓపీ) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమలరావు, ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు, SRP-1 గని అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.




