Kothagudem: ఖర్గేపై వివక్షకు నిరసనగా కొత్తగూడెంలో భారీ ర్యాలీ!

Kothagudem: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన కుల వివక్ష చర్యలను నిరసిస్తూ కొత్తగూడెంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Aug 2026 5:42 PM IST
Kothagudem
X

Kothagudem: ఖర్గేపై వివక్షకు నిరసనగా కొత్తగూడెంలో భారీ ర్యాలీ!

కొత్తగూడెం: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పట్ల కుల వివక్షకు సంబంధించిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల రమేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్‌లోని అమరవీరుల స్తూపం నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా గద్దల రమేష్, 25వ డివిజన్ కార్పొరేటర్ కనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో ఖర్గే ప్రసంగించిన వేదికను అనంతరం ‘శుద్ధీకరణ’ పేరుతో హవన్ నిర్వహించడం కుల, మత వివక్షను ప్రోత్సహించే చర్యగా అభివర్ణించారు. ఒక దళిత నాయకుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం అంటరానితన భావజాలాన్ని ప్రోత్సహించే ప్రయత్నమని ఆరోపించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

కుల వివక్షకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి

కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఎవరినీ అవమానించకుండా ప్రతి పౌరుడికి సమాన గౌరవం కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేవలం రాజకీయ వివాదంగా కాకుండా సామాజిక సమానత్వం, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా చూడాలని అన్నారు.

నిరసనకు ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం

ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా నిరసన ధర్నాకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కుల, మత వివక్ష రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఖర్గే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం జరిగే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ చైర్మన్ గడ్డం రాజశేఖర్, స్టేట్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్, కార్పొరేటర్లు కేకే శ్రీను, కనుకుంట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఆంతోటి పాల్, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు కల్లెపల్లె చంద్రశేఖర్, వైస్ చైర్మన్ పడిసిరి శ్రీనివాస్, జాడి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలు మోదుగు రామకృష్ణ, దార చిరంజీవి, సంపత్ కుమార్, బత్తినేని, దీపంగి వెంకటరమణ, రాజశేఖర్, భారతి, జయమ్మ, జిల్లా కార్యదర్శి పుల్లూరి కుమార్, పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు కొట్టే అనిల్ కుమార్, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు, మహిళా టౌన్ అధ్యక్షురాలు రాణి సదాశివ, మండల అధ్యక్షులు ఇందు కుమార్, పడుతుర్ రవి, పాలకుర్తి రవి, మచ్చ రాజా, మంద బాబు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story