Sathupalli: సత్తుపల్లి సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రుల సమీక్ష
Sathupalli: సత్తుపల్లిలో సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. భూసేకరణ కోసం రూ.135 కోట్లు విడుదల చేయాలని ఆదేశం.
Sathupalli: సత్తుపల్లి సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రుల సమీక్ష
సత్తుపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామాన్ని సందర్శించి సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం అధికారులతో సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లి ట్రంక్ టన్నెల్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి, పనుల పురోగతి, భూసేకరణ, నిధుల విడుదల, నిర్మాణ వేగం, పెండింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు రూపొందించారని, కేవలం రూ.1,500 కోట్లతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చిందన్నారు.
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, దాదాపు రూ.8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా అదనపు ఆయకట్టు తీసుకురాలేదని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టులో గతంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ ప్రస్తుతం రైతులకు ప్రయోజనం చేకూరేలా దానిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 100 కోట్లతో కొత్తగా రాజీవ్ లింక్ కెనాల్‌ను మంజూరు చేసి రికార్డు సమయంలో పూర్తి చేసి వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేశామని తెలిపారు. పాలేరు రిజర్వాయర్‌కు సాగునీరు తరలించేందుకు జూలూరుపాడు టన్నెల్ పనులను మంజూరు చేశామని, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులను కూడా చేపట్టామని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.1,000 కోట్ల బిల్లులు విడుదల చేసిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకే హైదరాబాద్‌లో మాత్రమే సమీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రాజెక్టుల వద్దకే వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టు భూసేకరణ కోసం వెంటనే రూ.135 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని, అవసరమైన బిల్లులు సిద్ధం చేసి టోకెన్లు వెంటనే పంపాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను వేగంగా పూర్తి చేస్తున్న నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేలా ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నామని తెలిపారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ నిధుల వివరాలను ప్రత్యేక నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి చెల్లింపులు చేస్తుందని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ విధానం ప్రకారం వేగంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించామని, జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల శాఖను సర్వనాశనం చేశారని, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి గత పాలకుల హయాంలో నిర్వీర్యమైన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వడం లేదని అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సీతమ్మ సాగర్, సీతారామ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ నిధులను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే చేసిన పనులకు 50 శాతం బిల్లులు చెల్లించాలని డిప్యూటీ సీఎంను కోరారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఎన్‌జీటీ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, నేడు సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి 67 టీఎంసీల నీటి కేటాయింపులు, టీఏసీ క్లియరెన్స్ తమ ప్రభుత్వమే సాధించిందని తెలిపారు. చట్టపరమైన సమస్యలను పరిష్కరించి సీతమ్మసాగర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ 2004లో ప్రారంభించిన దేవాదుల, సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిని కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. సీతారామ, సీతమ్మసాగర్‌తో పాటు గోదావరిపై పెండింగ్‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందిస్తామని తెలిపారు.
జూలై నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడి హట్టి ప్రాజెక్టుపై చర్చలు జరిపి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ బ్యారేజీలు గత ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయా యని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వాటిలో నీటిని నిల్వ చేయకుండా అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మూడు బ్యారేజీలకు ఒకే విధమైన ఫౌండేషన్ ఉన్నందున నీటిని నిల్వ చేయకుండా పరీక్షలు నిర్వహించి, టెస్ట్ రిపేర్ ఫలితాల ఆధారంగా మరమ్మతులు చేపడుతున్నామని, భారత సైన్యానికి చెందిన అధికారి, నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులపై కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి కాలేదని, డిండి ప్రాజెక్టు పనులు సగంలోనే నిలిచిపోయా యని, సీతారామ ప్రాజెక్టుపై రూ.8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు రాలేదన్నారు.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఎటువంటి బేషజాలకు పోకుండా గత పాలకులు నిలిపివేసిన సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తోందన్నారు.
ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, వైరా-లంకసాగర్ ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా కరువు కాలంలో కూడా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని స్పష్టం చేసిన మంత్రి, గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను డిజైన్ మార్పుల పేరుతో తాత్సారం చేయకుండా వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎన్పిడిసిఎల్ డైరెక్టర్ వి. మోహన్ రావు, ఇరిగేషన్ సిఈ లు శ్రీనివాస రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ యుగంధర్ రావు, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాస చారి, డిపిఓ రాంబాబు, సీపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




