Kothagudem: కొత్తగూడెంలో 50 నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్ల పంపిణీ!
Kothagudem: సఫా బైతుల్ మాల్, రహబర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 50 నిరుపేద కుటుంబాలకు ఉపాధి కోసం తోపుడు బండ్లు, కూరగాయలు, సామగ్రిని పంపిణీ చేశారు.
Kothagudem: కొత్తగూడెంలో 50 నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్ల పంపిణీ!
Kothagudem: ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు సఫా బైతుల్ మాల్, రహబర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో 50 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఉపాధి పొందేందుకు వీలుగా లబ్ధిదారులకు తోపుడు బండ్లతో పాటు కూరగాయలు, పండ్లు, ప్లాస్టిక్ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు, పండ్లు, ప్లాస్టిక్ సామగ్రి విక్రయించుకుంటూ కుటుంబాలను పోషించుకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించినట్లు పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా సఫా బైతుల్ మాల్, రహబర్ ఫౌండేషన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని జమియతే ఉలమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ కరీమ్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలవాలని ఫౌండేషన్ ప్రతినిధులను కోరారు.
నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తోపుడు బండ్లను అందజేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కొత్తగూడెం ప్రజలు ఫౌండేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.




