Kothagudem: ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ కలెక్టర్ అంకిత్ భాగస్వామ్యం!

Kothagudem: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం 100వ ఎపిసోడ్ విజయవంతం అయింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 July 2026 4:00 PM IST
Kothagudem
X

Kothagudem: ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ కలెక్టర్ అంకిత్ భాగస్వామ్యం!

Kothagudem: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం మంగళవారం 100వ ఎపిసోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, సుమారు మూడు లక్షల మంది రైతులు వర్చువల్‌గా పాల్గొని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను తెలుసుకున్నారు.

100వ ఎపిసోడ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్, ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ వ్యూహాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పద్ధతులు, చీడపీడల సమగ్ర యాజమాన్యం, పోషక నిర్వహణ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర అవగాహన కల్పించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం పూసగూడెం రైతు వేదికనుండి జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులతో కలిసి వర్చువల్ ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న శాస్త్రీయ సలహాలను రైతులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో సమర్థవంతమైన వేదికగా నిలిచిందని కలెక్టర్ అన్నారు . పంటల సాగుకు సంబంధించిన సందేహాలకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు పొందడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ఈ కార్యక్రమం విశేషంగా ఉపయోగపడుతోందన్నారు.

'రైతునేస్తం' కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అత్యధికసార్లు వీక్షించిన ముగ్గురు రైతులను, కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచిన మరో ఇద్దరు ఏ ఈ వోలను జిల్లా కలెక్టర్ అంకిత్ జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు , వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story