Khammam: పేద ప్రజల పక్షపాతి పువ్వాడ నాగేశ్వరరావు: అజయ్ కుమార్
Khammam: సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినం సందర్భంగా ఖమ్మంలో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 88 మందికి ఉచితంగా కృత్రిమ పాదాలు పంపిణీ చేశారు.
Khammam: పేద ప్రజల పక్షపాతి పువ్వాడ నాగేశ్వరరావు: అజయ్ కుమార్
Khammam: ఖమ్మం జిల్లాలో పేదల ప్రజల పక్షాన నిలబడి ఒకే జెండాను ఎజెండాను నమ్ముకుని సేవ చేసిన నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీపీఐ జాతీయ నాయకులు, మమత వైద్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినోత్సవం సందర్భంగా పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వద్ద 88 మంది దివ్యాంగులకు 3,52,00 వేల రూపాయల విలువైన కృత్రిమ పాదాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ పాదాలను అందజేశారు.
అందరికి ఉపయోగపడేలా పేదలకు నాణ్యమైన ఉచితంగా వైద్య సేవలు అందించడానికి 1996లో మమత ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. మమత ఆసుపత్రి జనతా ఆసుపత్రిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
సమాజంలోని నిరుపేదలు, దివ్యాంగులు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమర్థతతో జీవించేందుకు తోడ్పడాలనే లక్ష్యంతో గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఉచితంగా కృత్రిమ పాదాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఏడాది 88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలను అందజేయడంతో, ఇప్పటివరకు మొత్తం 1200 మందికి పైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది తమకు ఎంతో సంతృప్తినిచ్చే విషయమని, సేవా కార్యక్రమాలను కేవలం ఒకరోజుకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించడమే తమ కుటుంబం లక్ష్యమని పువ్వాడ చెప్పారు.
ప్రజాసేవే పరమావధిగా తమ కుటుంబం ఎప్పటికీ సమాజం కోసం పనిచేస్తుందని, భవిష్యత్తులోనూ ఇదే సేవాభావంతో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. పువ్వాడ నాగేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలోని అర్హులకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు.




