Kothagudem: శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి కొత్తగూడెంలో ర్యాలీ!
Kothagudem: హైదరాబాద్ ఆస్పత్రిలో మృతి చెందిన ఆదివాసీ యువతి శిరీష కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ నిర్వహించాయి.
Kothagudem: శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి కొత్తగూడెంలో ర్యాలీ!
Kothagudem: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీష కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, అంబులెన్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. శిరీష మృతికి కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు, మంద నాగకృష్ణ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో నగరానికి వచ్చిన 21 ఏళ్ల ఆదివాసీ యువతికి ఇలాంటి ఘటన జరగడం అత్యంత దుర్మార్గమన్నారు. శిరీష మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగాలని కోరారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శిరీష ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగినుల భద్రత కల్పించడంలో విఫలమైన ఆసుపత్రి యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
నగరాలకు ఉపాధి, విద్య కోసం వచ్చే శ్రామిక మహిళలు, నర్సులు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ యూనియన్ నాయకులు లక్ష్మణ్, మనోజ్, విష్ణు ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ టౌన్ నాయకులు భాను చరణ్ తదితరులు పాల్గొన్నారు.




