Kothagudem: నర్సు శిరీష హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి!

Kothagudem: హైదరాబాద్‌లో నర్సు శిరీష అత్యాచారం, హత్య ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీఓడబ్ల్యూ నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 31 Aug 2026 6:31 PM IST
Kothagudem
X

Kothagudem: నర్సు శిరీష హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాటిగూడెం గ్రామానికి చెందిన నర్సు శిరీషపై హైదరాబాద్‌లో అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు.

కొత్తగూడెం రైటర్ బస్తీలో సోమవారం POW ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి డివిజన్ నాయకురాలు కామ్రేడ్ సంధ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. బతుకుతెరువు కోసం హైదరాబాద్ తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష విశ్రాంతి కోసం గదిలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి బలవంతంగా గదిలోకి ప్రవేశించి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.

మహిళలు, బాలికలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా భయపడే పరిస్థితులు కొనసాగడం ఆందోళనకరమని ఆదిలక్ష్మి అన్నారు. మహిళలపై జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

మహిళలు పనిచేసే ప్రదేశాల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. శిరీష ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కళ్యాణి, లక్ష్మి, కరుణ, నాగలక్ష్మి, రాజమ్మ, విజయ, సునీత, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story