Annapureddypalli: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో సందడి చేసిన మంత్రి!
Annapureddypalli: అన్నపురెడ్డిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.2.77 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.
Annapureddypalli: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో సందడి చేసిన మంత్రి!
అన్నపురెడ్డిపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా గుంపెన గ్రామంలో ఎంహెచ్ రోడ్డు నుండి పప్పుల గోపయ్య ఇంటి వరకు, గ్రామంలోని తొమ్మిది అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.నరసాపురం గ్రామంలో గాదె సుధాకర్ రెడ్డి ఇంటి నుండి నంద్యాల కేశవరెడ్డి ఇంటి వరకు, అలాగే ఎనిమిది అంతర్గత సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా రూ.117.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
భీమునిగూడెం గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.కోండాయిగూడెం గ్రామంలోని 2బీహెచ్‌కే కాలనీలో పీఆర్–బీటీ రోడ్డు నుండి కుంజా రాధ ఇంటి వరకు, వీరభద్రం ఇంటి నుండి దుబ్బాకారం నగేష్ ఇంటి వరకు, పద్దం మెహన్‌రావు ఇంటి నుండి మీడియం తిరుపతిరావు ఇంటి వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మొత్తం రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంటలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి పైదా వీరకృష్ణ ఇంటి వరకు, అలాగే 17 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.75.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పెద్దిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అగ్గి రాజమ్మ, గుంపెన గ్రామానికి చెందిన మాయారా వసంత, భీమునిగూడెం గ్రామానికి చెందిన వాడే సుజాత, నరసాపురం గ్రామానికి చెందిన తిరుమలదేవి అనిత, చీపుడు జ్యోతి, ఊటుపల్లి గ్రామానికి చెందిన మొల్లచవుకు కవిత, రంగాపురం గ్రామానికి చెందిన వేముల కృష్ణయ్య, పెనుగొండ కోటమ్మల నూతన గృహాల్లో గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదల, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ సంకల్పమని, రాష్ట్రంలో పూరిగుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు . అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి వారం రోజుల్లో పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, గ్రామపంచాయతీ భవనాలు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామీణ రహదారులు, గ్రామపంచాయతీ భవనాలు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, రహదారులు, కల్వర్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్టిఓ మధు,హౌసింగ్ పీడీ, పంచాయతీ అధికారి అనూష, అన్నపురెడ్డిపల్లి తాసిల్దార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




