Kothagudem: ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ రీ-సర్వే మంత్రి పొంగులేటి!
Kothagudem: భూ సమస్యల పరిష్కారానికి జియో కోఆర్డినేట్లతో రీ-సర్వే చేపడుతున్నామని, నవంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Kothagudem: ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ రీ-సర్వే మంత్రి పొంగులేటి!
Kothagudem: ప్రజలకు ఎలాంటి వివాదాలు లేని భూమిని అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన అంశాలపై మండల స్థాయి వరకు అధికారులతో, ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ భూ వివాదాల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, శాసనసభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ-సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే:
భూ రీ-సర్వేలో భాగంగా తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి, నవంబర్ 2026 నాటికి ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రీ-సర్వే నిర్వహిస్తున్నామని, ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన జియో కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్‌ను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో సుమారు 125 సంవత్సరాల క్రితం సర్వే జరిగిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న భూ రీ-సర్వే ద్వారా దాదాపు అన్ని భూ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇప్పటికే సుమారు 25 శాతం గ్రామాలు రీ-సర్వేలో వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ చివరి నాటికి రీ-సర్వే ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
1,750 సర్వే యంత్రాలతో రీ-సర్వేకు వేగం:
రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 950 సర్వే యంత్రాలను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. మరో 800 యంత్రాలను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తొలి విడత రీ-సర్వేలో ఎదురయ్యే సమస్యలు, అధికారులు పొందే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో సర్వే ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి:
హౌసింగ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో భాగంగా తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో ప్రతి నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను గుర్తించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు:
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో సక్రమంగా పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. అధికారులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని, అయితే ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ధరణిని బంగాళాఖాతంలో కలిపి ప్రజలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. భూ భారతి చట్టంలో క్రింద స్థాయి అధికారులకు అనేక రకాల అధికారాలను వికేంద్రీకరించి అందించామని చెప్పారు.
అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి తెలిపారు. ఈ అంశాలపై సమీక్షలో అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
సమీక్షల అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలు:
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇప్పటికే సమీక్షలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సమీక్షలు పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




