Kothagudem: అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ రోహిత్ రాజు ఉక్కుపాదం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో పోలీసులు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 July 2026 4:36 PM IST
Kothagudem
X

Kothagudem: అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ రోహిత్ రాజు ఉక్కుపాదం!

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 08.00 గంటల నుండి 10.00 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం,పాత నేరస్తులను కనిపెట్టే విధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, ముఖ్య రహదారులు, గ్రామాల్లో ఈ నాకాబందీ నిర్వహించబడిందన్నారు.

ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 3714 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 2384 ద్విచక్ర వాహనాలు, 987 నాలుగు చక్రాల వాహనాలు, 434 లారీలు ఉన్నాయి.

తనిఖీల సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 510 మంది, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన లేదా నంబర్ ప్లేట్ లేని 308 వాహనాలు, హెల్మెట్ ధరించని 524 మంది, సీటు బెల్ట్ ధరించని 106 మంది, మైనర్లు నడిపిన 14 వాహనాలు, అక్రమంగా సైలెన్సర్ మార్పులు చేసిన 4 వాహనాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో 07 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 15 అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా, తనిఖీల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనాని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలపై 764 స్పాట్ చల్లనలను విధించగా, 1567 వాహనాల నుండి జరిమానా వసూలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story