Kothagudem: కొత్తగూడెంలో వరుస చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్!

Kothagudem: భద్రాద్రి వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన పోలీసులు, అంతర్రాష్ట్ర నేరస్థుడితో సహా 8 మందిని అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Aug 2026 2:14 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో వరుస చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

రాత్రివేళల్లో మహిళలే లక్ష్యంగా..

ముఠాలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సున్నం నాగేంద్రబాబు (35) తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మహిళల మెడలోని బంగారు గొలుసులను వైర్ కట్టర్‌తో కట్ చేసి, వెంటనే ద్విచక్ర వాహనాలపై పరారయ్యేవారని పోలీసులు తెలిపారు.

కొన్ని సందర్భాల్లో ముందుగానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటిని తదుపరి నేరాలకు ఉపయోగించినట్లు గుర్తించారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు

దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 10 కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నాగేంద్రబాబుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్లో కొందరిపై 11, 12 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుల్లో మరో నిందితుడైన తమ్మిశెట్టి బాలవీరస్వామి (50) పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాధాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను అంతర్రాష్ట్ర నేరస్థుడిగా గుర్తించినట్లు, ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

దర్యాప్తులో భాగంగా దమ్మపేట పరిధిలో వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసు చోరీ చేయడం, బూర్గంపాడు, పాల్వంచ రూరల్ పరిధుల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం, అనంతరం ఆ వాహనాలతో వివిధ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాయిగూడెం కేసులో ప్రధాన నిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర కేసుల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

వరుస చైన్ స్నాచింగ్ కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు..

ఒంటరిగా ఇళ్లలో నిద్రించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, తలుపులు కిటికీలు భద్రంగా ఉంచుకోవడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పి సూచించారు. నేరాల కట్టడిలో సీసీ కెమెరాలు ఆవశ్యకతను వివరించారు.

ఈ కేసుల ఛేదనలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ వాగరాజు, ఎస్‌ఐలు రాటేశ్ కుమార్, యయాతి రాజు, బాలస్వామినాధం, దేవ్‌సింగ్, హెచ్‌సీ ప్రసాద్, పీసీలు వెంకట్, ధర్మారావు, లక్ష్మయ్య, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, నరసింహారావు, ఉమెన్ పీసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story