Kothagudem: కొత్తగూడెంలో సరికొత్త ఆధార్ కేంద్రం.. కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం!

Kothagudem: కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ వద్ద నూతన ఆధార్ కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 10 Sept 2026 2:08 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో సరికొత్త ఆధార్ కేంద్రం.. కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం!

కొత్తగూడెం: జిల్లా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి సిబ్బంది వివరాలు, ప్రజలకు అందించనున్న సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్రం మేనేజర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్తగూడెంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో ఆధార్‌లో చిన్నచిన్న మార్పులు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే ఆధార్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు, సమయం తగ్గనున్నాయని తెలిపారు.

ఈ కేంద్రంలో ఆధార్ వివరాల అప్‌డేట్, బయోమెట్రిక్ అప్‌డేట్, ఇతర ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులకు సౌకర్యవంతంగా సేవలు అందించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సాధారణ పద్ధతిలో బయోమెట్రిక్ నమోదు కాకపోయే వారికి కూడా నిబంధనల మేరకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ఆధార్ సేవలు అందించే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ పెన్షన్లు, వివిధ ఆర్థిక సహాయాలు పొందేవారితో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తదితరులకు ఆధార్ వివరాలు అప్‌డేట్‌గా ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో UIDAI రీజినల్ మేనేజర్ నరేష్ చంద్ర, BLS ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ హరినాథ్, ఆధార్ కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story