Kothagudem: మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

Kothagudem: కొత్తగూడెం మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి సందడి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 3 Sept 2026 8:12 PM IST
Kothagudem
X

Kothagudem: మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం: ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీలు పడుతూ విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లల్లా మారిపోయారు. మైదానంలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతూ కేరింతలు కొట్టారు.

ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ 12వ వార్డులో ఉన్న మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో టీచర్లకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన కాంతులను పంచుతూ దేశ అభివృద్ధికి బాటలు వేసే భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. వైద్యులు, ఇంజినీర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు తదితర ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఎదుగుదల వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

ఉపాధ్యాయుల వద్దకు అవసరంతో వెళ్లినప్పుడు తమ స్థాయికి కారణమైన గురువులను మరిచిపోవడం బాధాకరమన్నారు. ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన గౌరవం ఇస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరి హోదా, స్థానం, ఆస్తి అంతస్తుల వెనుక చిన్నతనంలో చేయిపట్టి అక్షరాలు నేర్పిన గురువుల కృషి ఉందని గుర్తు చేశారు.

తులసీదాసు చెప్పినట్లు దైవం, గురువు ఇద్దరూ ఎదురుగా నిలబడితే ముందుగా గురువుకే నమస్కరిస్తానని, ఎందుకంటే దైవాన్ని గుర్తించే జ్ఞానాన్ని గురువే ప్రసాదించాడని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ, ప్రతిక్షణం గౌరవించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, విజయలక్ష్మి, సల్మా, సరస్వతి, నస్రత్, జేఫీషా, లతీఫా, అనిత, రుభీనా, నాజియా, సుహాన, సల్మా జబీన్, శిరీష తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story