Kothagudem: కొత్తగూడెంలో సెప్టెంబర్ 12న ముస్లిం ఐక్య సంఘం భారీ బహిరంగ సభ
Kothagudem: కొత్తగూడెం క్లబ్‌లో సెప్టెంబర్ 12న ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.
Kothagudem: కొత్తగూడెంలో సెప్టెంబర్ 12న ముస్లిం ఐక్య సంఘం భారీ బహిరంగ సభ
కొత్తగూడెం: ముస్లిం సమాజాన్ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడంతో పాటు సమాజంలో ఐక్యత, సత్ప్రవర్తన, సేవా భావం, సమన్యాయం పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం పనిచేస్తోందని సంఘం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ గౌస్,
రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు, షేక్ ముజాహిద్, షేక్ హుస్సేన్ సాబ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్లర్యంలో కొత్తగూడెం జిల్లాలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఇప్పటికే పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదే విధంగా కొత్తగూడెం జిల్లాలోనూ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఖురాన్, ప్రవక్త బోధనల్లో చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఐదు ప్రధాన అంశాల ఆధారంగా సంఘం పనిచేస్తోందన్నారు. విశ్వాసం, ఐక్యత, సత్ప్రవర్తన, సేవ, సమన్యాయం ప్రధాన లక్ష్యాలని వివరించారు.
భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ లౌకిక విలువలు, మత సామరస్యం, మత సహనాన్ని పాటించాలని, హిందూ-ముస్లిం భాయీ భాయీ భావనతో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువతలో సత్ప్రవర్తన పెంపొందించేందుకు చిన్న వయసు నుంచే మక్తబ్‌ల ద్వారా మంచి విలువలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ముస్లింలకే పరిమితం కాకుండా అవసరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక సహాయం వంటి సేవలు అందించేందుకు సంఘం ముందుంటుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ముస్లిం సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందాలని, డబ్బున్నవారికి ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం ఉండకూడదన్నారు. కులమత భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గత సంవత్సరం ఖమ్మం జిల్లాకేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించామని తెలిపారు. ఈసారి సెప్టెంబర్ 12న సాయంత్రం 6:30 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ముస్లిం ఐక్య సంఘం నాయకులు కోరారు. సంఘం సభ్యులే తమ సంపాదనలో కొంత భాగాన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, ఎవరి వద్ద నుంచి విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆబీద్ హుస్సేన్, జియావుద్దీన్, హుస్సేన్ అలీ , రసూల్ హఫీజ్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.




