Kothagudem: పోచమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రావణ బోనాల వేడుకలు
Kothagudem: లక్ష్మీదేవిపల్లి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ బోనాల పండుగ. ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
Kothagudem: పోచమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రావణ బోనాల వేడుకలు
కొత్తగూడెం: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
లక్ష్మీదేవిపల్లి పరిధిలోని సింగరేణి బంగ్లోస్ గేటు సమీపంలో వెలసిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం శ్రావణమాస బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శ్రావణ బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే గొప్ప సంప్రదాయం తెలంగాణ పండుగల్లో దాగి ఉందన్నారు. గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను కొలవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
బోనాల వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు సమాజంలో భక్తిభావంతో పాటు సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోచమ్మ తల్లి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, ఆలయ ధర్మకర్త రాజయ్య తదితరులు పాల్గొన్నారు.




