Lakshmidevipally: లక్ష్మీదేవిపల్లి మండలంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం

Lakshmidevipally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. 117 మందికి వైద్య పరీక్షలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 18 Aug 2026 9:00 PM IST
Lakshmidevipally
X

Lakshmidevipally: లక్ష్మీదేవిపల్లి మండలంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం

లక్ష్మీదేవిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు మొత్తం 117 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. నెఫ్రాలజీలో 2, ఆర్థోపెడిక్స్‌లో 20, గ్యాస్ట్రో మెడిసిన్‌లో 10, జనరల్ మెడిసిన్‌లో 34, న్యూరో విభాగంలో 2, ఆంకాలజీలో 2, కార్డియాలజీలో ఒకరు, మధుమేహ విభాగంలో 24, నేత్ర వైద్యంలో 22 మంది వైద్య సేవలు పొందారు.

డాక్టర్ సునీల్ కుమార్ జంగాల (ఎండీ, డీఎం), డాక్టర్ స్వాతి జంగాల (ఎంబీబీఎస్, డి.డయాబ్.) ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణి, డాక్టర్ రేణుక తదితర వైద్యులు సేవలందించారు. నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపీ సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ సామ్యూల్ గెడ్డం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 15కు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, భవిష్యత్తులోనూ మరిన్ని శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.

గ్రామ సర్పంచ్ బానోత్ రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనేరు పూర్ణచంద్రరావు, కోనేరు సత్యనారాయణ, 59వ డివిజన్ కార్పొరేటర్ రావి రాంబాబు, రాజీవ్ యువశక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వందనపు సూర్యప్రకాశ్‌రావు, ఉపసర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story