Kothagudem: అనుమతి లేని విద్యుత్ లైన్లు – విద్యుత్ అధికారులపై కేసు నమోదు
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రిజర్వు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు వేసిన అధికారులపై కేసు నమోదు చేసిన అటవీశాఖ.
Kothagudem: అనుమతి లేని విద్యుత్ లైన్లు – విద్యుత్ అధికారులపై కేసు నమోదు
కొత్తగూడెం: అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేయడంపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల ప్రాంతంలోని రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 127 విద్యుత్ స్తంభాలు, పాల్వంచ మండలం బంజార గ్రామ పంచాయతీ పరిధిలోని వైల్డ్‌లైఫ్ ప్రాంతంలో 32 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్లలోని రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 127 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో AE, ADEలపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు పాల్వంచ మండలం బంజార గ్రామ పంచాయతీ పరిధిలోని వైల్డ్‌లైఫ్ ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఫారెస్ట్ శాఖ అనుమతులు తీసుకోకుండానే సుమారు 32 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
సుమారు 15 రోజులపాటు పనులు కొనసాగినప్పటికీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంపై ఫారెస్ట్ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని, దీంతో AE, లైన్‌మెన్‌పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
రిజర్వు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ పరిధుల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేయడంపై అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారులు పరిశీలన చేపట్టి, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అటవీ భూముల్లో అనుమతులు లేకుండా విద్యుత్ పనులు చేపట్టడంపై అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.




