Kothagudem: కొత్తగూడెం హాస్పిటల్ తిప్పలు 173 పోస్టులకు కేవలం 40 మందేనా?
Kothagudem: కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారిందని సిపిఎం (CPM) బృందం ఆరోపించింది. తీవ్రమైన డాక్టర్ల కొరత, మందుల సప్లై లేకపోవడం
Kothagudem: కొత్తగూడెం హాస్పిటల్ తిప్పలు 173 పోస్టులకు కేవలం 40 మందేనా?
కొత్తగూడెం: సమస్యలకు నిలయంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఉందని జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు కార్యదర్శి అన్నారు.స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సిపిఎం బృందం సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఉన్న సమస్యలు కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వచ్చాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలియజేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గుండె కిడ్నీ నరాల సంబంధించిన డాక్టర్ల లేరని అసలు ఆ విభాగమే హాస్పిటల్ లో పనిచేయడం లేదని ఆయన అన్నారు.
దీనివలన గుండె కిడ్నీ నరాలకు సంబంధించిన సమస్య వస్తే ప్రజలు ఖమ్మం గాని హైదరాబాదు లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుండి హాస్పిటల్ కి సిరంజీల సప్లై లేదని దీనివలన ప్రైవేటు మెడికల్ షాప్ లను ఆశ్రయించి డబ్బులతో మెడిసిన్ మరియు సిరంజీలు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు.
తాము సర్వే చేసిన రోజున సిరంజీలు లేవని రక్త పరీక్షలు కూడా చేయకుండా రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డాక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 173 డాక్టర్ పోస్టులకు గాను కేవలం 40 మంది మాత్రమే ఉన్నారని వీరిలో 15 మంది తాత్కాలిక డాక్టర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. జిల్లా కేంద్రం హాస్పిటల్ లో డాక్టర్ల కొరత ఈ విధంగా ఉంటే ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. అంబులెన్స్లు ఐదు అవసరం కాగా కేవలం రెండు అంబులెన్స్ మాత్రమే పనిచేస్తున్నాయని దీనివలన అత్యవసర పరిస్థితుల్లో రోగులు హాస్పిటల్ కి రావాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హాస్పిటల్లో మంచినీటి సౌకర్యం సక్రమంగా లేదని హాస్పిటల్ విస్తరించిన తర్వాత హాస్పిటల్ డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడి మురుగునీరు నిల్వ ఉండి హాస్పిటల్ చుట్టుపక్కల రోడ్లమీదకు వస్తున్నాయని దీనివలన హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.తక్షణమే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చర్మ వ్యాధులు కంటి వైద్యానికి సంబంధించి ఒక చిన్న రూమ్ లో ఓపి ఏర్పాటు చేశారని దీని వలన పేషెంట్లు అలాగే డాక్టర్ కూడా ఇబ్బంది పడుతున్నారని ఇది తమ దృష్టికి వచ్చినట్లు వారు తెలియజేశారు. రోజుకు సుమారు ఆరు వందల మంది ప్రజలు హాస్పిటల్ కి వస్తుండగా నడవడం చేతకాని వారిని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లాలంటే అంత పెద్ద హాస్పిటల్ లో కేవలం మూడు స్ట్రెచ్చర్స్ మాత్రమే ఉన్నాయని అన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన రక్త పరీక్షలు సిటీ స్కానింగ్ వంటి పరీక్షలు చేయడానికి డాక్టర్ల కొరత ఏర్పడిందని దీనివలన సౌకర్యాలు ఉన్న వాటిను ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించే హాస్పిటల్ నిర్మాణం నత్తనడకన నడుస్తుందని తెలిపారు. తక్షణమే నూతన భవన నిర్మాణాన్ని పూర్తిచేసి మెడికల్ కాలేజీ కనుబంధంగా నూతన జిల్లా కేంద్ర ఆసుపత్రిని ప్రారంభించాలని వారి డిమాండ్ చేశారు.
తక్షణమే హాస్పిటల్ సమస్యలు పరిష్కారానికి నిధులు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ వైద్య రంగాన్ని పట్టించుకోని జిల్లా మంత్రులు
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రిని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య విమర్శించారు. కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్లు హాస్పిటల్ సందర్శించుతున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపట్లేదని ఆయన ఆరోపించారు. వైద్య విధాన పరిషత్ నుండి డిఎంఈ పరిధిలోకి వచ్చినప్పటికీ పేరు మార్పే తప్ప సౌకర్యాలలో అభివృద్ధి మాత్రం కనబడడం లేదని విమర్శించారు.
వర్షా కాలంలో సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడడానికి సరైన వైద్య సదుపాయం అందించాలని మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ ,లిక్కి బాలరాజు ,జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ కార్యదర్శివర్గ సభ్యులు నందిపాటి రమేష్ ,టౌన్ కమిటీ సభ్యురాలు అన్నవరపు ఇందిర..నాయకులు బాలకృష్ణ ,రాములు ,రఘు,నాగమణి ,రేణుక సలీం తదితరులు పాల్గొన్నారు.




