Kothagudem: బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాలలో సీపీఎం బృందం సర్వే

Kothagudem: బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు, డ్రైనేజీ, ప్లేగ్రౌండ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా నాయకుడు భూక్య రమేష్ డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 26 Aug 2026 6:40 PM IST
Kothagudem
X

Kothagudem: బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాలలో సీపీఎం బృందం సర్వే

కొత్తగూడెం: బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్య రమేష్ డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బుధవారం సిపిఎం ప్రతినిధి బృందం పాఠశాలలో సమస్యలపై సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలలో బాత్రూమ్‌లు, టాయిలెట్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మూత్రశాలల నుంచి బయటకు వస్తున్న నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పరిసరాల్లో దుర్గంధం వ్యాపిస్తోందని రమేష్ తెలిపారు.

పాఠశాలకు ప్లే గ్రౌండ్ ఉన్నప్పటికీ వర్షాకాలంలో వరద నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఆటలు ఆడుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. దుర్గంధం, పారిశుద్ధ్య సమస్యలతో బస్తీ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై పాఠశాల అధ్యాపకులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పారిశుద్ధ్య సమస్యల కారణంగా విద్యార్థులు, స్థానిక ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి, టాయిలెట్లు, డ్రైనేజీ, ప్లే గ్రౌండ్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాణి మాడుగుల ప్రభాకర్, రాజ్‌కుమార్, స్వచ్ఛ మిత్ర నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story