Kothagudem: యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు

Kothagudem: అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మై భారత్ పోర్టల్ నమోదు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 July 2026 7:15 PM IST
Kothagudem
X

Kothagudem: యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు

కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ (MY Bharat) పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్( రెవెన్యూ) సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం (District Advisory Committee on Youth Programmes) సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 9 వేల మంది యువత ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా ఈ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.

జిల్లాలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలను సందర్శించి ప్రతి విద్యార్థిని మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయించాలని ఆదేశించారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయికి పంపాలని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యువతకు భారత పార్లమెంట్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు.

వికసిత్ భారత్ కార్యక్రమంలో నిర్వహించే క్విజ్ పోటీల్లో విజేతలకు దేశ సరిహద్దు రాష్ట్రాల పర్యటన అవకాశం లభిస్తుందని, కొన్ని కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రధాన మంత్రిని కలిసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాలపై యువతలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం, తదితర ఎనిమిది రకాల పోటీలను జిల్లాలో నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో విజేతలకు కేంద్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకట్రామ్ బాబు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి , జిల్లా షెడ్యూల్డ్ తరగతుల అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా ఇంటర్మీడి యేట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు , జిల్లా విద్యాధికారి వసంత, జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం అధికారి డా. కామేశ్వర రావు, అడిషనల్ డిఎంహెచ్ఓ., సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story