Manuguru: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఐటీడీఏ పీఓ బి. రాహుల్!
Manuguru: మణుగూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఐటీడీఏ పీఓ, ఈఆర్ఓ బి. రాహుల్.. అధికారులకు ఆదేశాలు.
Manuguru: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఐటీడీఏ పీఓ బి. రాహుల్!
Manuguru: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని పినపాక నియోజకవర్గం ఈ ఆర్ ఓ మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత తాసిల్దార్లకు ఆదేశించారు.
బుధవారం నాడు మణుగూరు లోని సమితి సింగారం గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించిన అనంతరం మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సర్ ఓటర్ నమోదు ప్రక్రియ పై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు నోటీసుల జారీ, నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న కేసులు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అనర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు సమగ్ర పరిశీలన నిర్వహించాలని ఆయన సూచించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఆ హక్కు లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నోటీసు అందజేసిన అనంతరం సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) తప్పనిసరిగా అందజేసినట్లు రసీదును యాప్‌లో నమోదు చేయాలని, రసీదు వివరాలు యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే సంబంధిత నోటీసు అందజేత పూర్తయినట్లుగా పరిగణించాలని పేర్కొన్నారు. మిగిలిన నోటీసుల పంపిణీపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పినపాక నియోజకవర్గంలో434 మందికి
విచారణకు పిలిచిన వారిలో దాదాపు 60 శాతం మంది హాజరవుతుండగా, హాజరవుతున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది సరైన ధ్రువపత్రాలు లేకుండా వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో విచారణ తేదీకి ముందుగానే సంబంధిత ఓటర్లకు సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని ఆయన సూచించారు. ఓటర్లు అవసరమైన పత్రాలతో విచారణకు హాజరయ్యేలా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఇంటినీ సందర్శించి, సంబంధిత ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సహకారం అందించేలా బీఎల్‌ఓల పనితీరును అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాల నిర్ధారణకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువపత్రాలను ఓటర్లు సమర్పించేలా అధికారులు బి ఎల్ వో లకు సూచించాలని, ఓటరు పేరు లేదా ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో తగిన ఆధారాలు అందుబాటులో లేనట్లయితే, నిబంధనల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన, పంచనామా తదితర అవసరమైన ప్రక్రియలను చేపట్టాలని సూచించారు.
అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు నిరాకరించబడకుండా చూడటంతో పాటు, అర్హత లేని వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టడమే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఓటర్ల పేర్ల తొలగింపుకు సంబంధించిన ప్రతి కేసును నిబంధనల మేరకు సమగ్రంగా పరిశీలించి, కారణాలను స్పష్టంగా నమోదు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో మణుగూరు తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఎలక్షన్ డ్యూటీలు అనూష, రామారావు తదితరులు పాల్గొన్నారు.




