Kothagudem: మొక్కజొన్న నిల్వలు వెంటనే గోదాములకు తరలించండి కలెక్టర్ ఆదేశం

Kothagudem: ఆళ్లపల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 May 2026 5:48 PM IST
Kothagudem
X

Kothagudem: మొక్కజొన్న నిల్వలు వెంటనే గోదాములకు తరలించండి కలెక్టర్ ఆదేశం

Kothagudem: ఆళ్లపల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మొక్కజొన్న కొనుగోలు, నిల్వ, లోడింగ్ మరియు రవాణా ప్రక్రియలను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం 117 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వ ఉన్నదని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మొక్కజొన్న నిల్వలు ఎక్కువకాలం కొనుగోలు కేంద్రంలో ఉండకుండా వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు తీసుకొస్తున్న మొక్కజొన్నను సకాలంలో కొనుగోలు చేసి వేగవంతంగా లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు.

ముఖ్యంగా రవాణా వాహనాలు, హమాలీల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. లారీల కొరత లేదా హమాలీల సమస్యల కారణంగా తరలింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ అధికారులను అడిగి లారీల అందుబాటు, లోడింగ్ పనుల పురోగతి, రోజువారీ తరలింపు సామర్థ్యం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైతే అదనపు వాహనాలు సమకూర్చి మొక్కజొన్న నిల్వలను వేగవంతంగా తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని నిల్వ ఉన్న మొక్కజొన్న తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు శాతం, వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా మెడికల్ అధికారి తరుణ్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో ఎందుకు లేరని సిబ్బందిని ప్రశ్నించి వివరణ కోరారు. సంబంధిత శాఖ అధికారులను దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికలు, రిజిస్టర్‌లను పరిశీలించి ప్రతి ఉద్యోగి విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన సిబ్బంది సెలవుల వివరాలు, డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న వారి సమాచారం తదితర అంశాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.

అవుట్ పేషెంట్ విభాగం, పరీక్షల గది, మందుల నిల్వ గది, ఇన్ పేషెంట్ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వడదెబ్బతో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యేకంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, మందులు, పర్యవేక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ తగిలిన వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో వైద్య సేవలు ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, పడకలు అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు .

ఈ పరిశీలనలో తహసీల్దార్ ఉషారాణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story