Khammam: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

Khammam: ఖమ్మం జిల్లా జమలాపురం క్షేత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గత బీఆర్ఎస్ పాలన, ఫోన్ ట్యాపింగ్‌లపై మండిపడ్డారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Jun 2026 3:01 PM IST
Khammam
X

Khammam: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

Khammam: బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలను తమ కుటుంబం కోసం తమ నలుగురి కోసం అన్నట్లుగా పదేళ్లు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సంపదను నలుగురు కుటుంబ సభ్యులు దోచుకొని ఆ డబ్బుతో నాలుగు చానళ్లు పత్రికలు సోషల్ మీడియా ద్వారా అబద్దాలు పోగేసి ప్రజా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు ఉపముఖ్యమంత్రి సతీసమేతంగా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు, అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం​ మాధవ సేవ మానవ సేవ అనే మన సంస్కృతి విలువలతో ముందుకు సాగుతోందని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలు తీర్చడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిలబెట్టగలమని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.

​బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఉప ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాటి ప్రభుత్వంలో ఒకరిద్దరు వ్యక్తులు రాష్ట్ర వనరులన్నింటినీ కొల్లగొట్టి, దోపిడీ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి, కేవలం నలుగురి సంక్షేమం, అభివృద్ధి కోసమే ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని విమర్శించారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆ నిధులన్నింటినీ కరిగించి మరో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులను మిగిల్చారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు.

​ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుపేదల, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను గుర్తిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇందుకోసం 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

​రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ​మార్కెట్‌లో కిలో రూ. 50-55 ధర ఉన్నప్పటికీ, పేద కుటుంబాల్లో ఏ ఒక్కరూ కూడా నాణ్యమైన ఆహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ​పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో గ్రామాల్లో 90% కుటుంబాల కరెంట్ బిల్లు ప్రభుత్వమే ప్రతి నెల బిల్లులు చెల్లిస్తోందన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల పంప్ సెట్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని అన్నారు. దీనికోసం సంవత్సరానికి రూ. 14,000 కోట్లను ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లిస్తోందన్నారు. ​రాష్ట్ర మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ​మహిళలు తీసుకునే టికెట్లకు సంబంధించిన నగదును ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 10,600 కోట్ల రూపాయలను ఈ పథకం కింద ఆర్టీసీకి ఆర్థిక శాఖ చెల్లించడం జరిగిందన్నారు.

​మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రూ. 20,000 కోట్ల రుణాలు అందిస్తూ, 5 సంవత్సరాలలో లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గతంలో ఉన్న రూ. 5 లక్షల సీలింగ్‌ను రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ​గత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తంగా మారి పేదలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, దానిని మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచిందని తెలిపారు.

​ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. ​డైట్ చార్జీలను 40%, కాస్మోటిక్ చార్జీలను 200% పెంచడం జరిగిందని తెలిపారు. ​అత్యంత మానవీయ కోణంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది విద్యార్థులకు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 7 లక్షల మంది విద్యార్థులకు, మొత్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయపు ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. వారంలో ఆరు రోజులు అల్పాహారంతో పాటు ఒకరోజు పాలు, ఒకరోజు రాగిజావ అందిస్తున్నామని అన్నారు.

దేవాలయాల అభివృద్ధికి సంస్కృతి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం ₹2,216 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి, అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారలమ్మ లాంటి దేవాలయాలను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ, ప్రజల మనోభావాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.

​గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడమే కాకుండా, దాదాపు 76,000 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని ఆయన గుర్తుచేశారు.

​రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

​ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 90,000 కోట్ల రూపాయలతో రహదారుల పనులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిన్ననే నల్గొండలో రూ. 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. ​హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచంతో పోటీపడేలా ఒక "ఫ్యూచర్ సిటీ" ని నిర్మిస్తున్నామన్నారు.

​మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో పాటు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సర్వీస్ సెక్టార్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (పరిశ్రమలు), రూరల్ రీజియన్ ఎకానమీ (వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు)గా విభజించి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.

​గత పాలకులు రాష్ట్రంలో ఎవరినీ స్వేచ్ఛగా బతకనివ్వలేదని, ప్రతి ఒక్కరి టెలిఫోన్లను ట్యాప్ చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్నా, అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్థులు, సినిమా ఇండస్ట్రీ వారు ఎవరు మాట్లాడుకున్నా ట్యాప్ చేసి వినే రాక్షస కోణాన్ని గత ప్రభుత్వం ప్రదర్శించిందని అన్నారు. అబద్ధాలతో ఆర్భాట ప్రచారం చేసుకుందని దుయ్యబట్టారు.

​రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డిసిసి వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story