Kothagudem: విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలు!

Kothagudem: విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలపై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Aug 2026 2:17 PM IST
Kothagudem
X

Kothagudem: విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలు!

Kothagudem: విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక మంచికంటి భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లిక్కి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మచ్చా వెంకటేశ్వర్లు తొలుత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 26 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేసే క్రమంలో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిర్వహించిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చారని, ఆ సమయంలో ప్రభుత్వం ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడంతో పాటు కాల్పులు జరిపిందని ఆయన ఆరోపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి మృతి చెందారని తెలిపారు.

అమరవీరుల త్యాగాలతో కూడిన ప్రజా పోరాటం ఫలితంగా అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. నాటి పోరాట ప్రభావంతోనే ఆ తర్వాతి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు సాహసించలేదని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు ఎంతటి శక్తి ఉందో విద్యుత్ పోరాటం నిరూపించిందన్నారు.

ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యుత్ సంస్కరణల చట్టాల ద్వారా ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వినియోగదారులపై భారం మోపే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని కోరారు.

కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు భూక్య రమేష్, నాయకులు నందిపాటి రమేష్, వై. వెంకటేశ్వరరావు, ఎలగొండ రఘు, వాణి, సతీష్, సలీం, నాగమణి, రసూల్‌బీ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story