Kothagudem: కొత్తగూడెంలో సీతారాం ఏచూరి రెండో వర్ధంతి!

Kothagudem: కొత్తగూడెంలో సీపీఎం మాజీజనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ మార్క్సిస్టు మేధావి ఏచూరి సేవలను కొనియాడిన తమ్మినేని వీరభద్రం బండారు రవికుమార్

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 13 Sept 2026 7:07 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో సీతారాం ఏచూరి రెండో వర్ధంతి!

Kothagudem: ప్రపంచం గర్వించదగిన మార్క్సిస్టు మేధావి, ప్రజా ఉద్యమాల నేత సీతారాం ఏచూరి అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్లమెంటులోనూ, ప్రజా పోరాటాల్లోనూ కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల గొంతుకగా ఏచూరి నిలిచారని కొనియాడారు.

కొత్తగూడెంలోని కమ్మ కళ్యాణ మండపంలో సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం, బండారు రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన గొంతు సీతారాం ఏచూరిదని అన్నారు. లౌకికవాదంపై దాడి జరిగిన ప్రతిసారీ గట్టిగా ప్రతిఘటించారని తెలిపారు. కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఎర్రజెండా నాయకుడిగా ఏచూరి నిలిచారని పేర్కొన్నారు.

మార్క్సిజాన్ని కేవలం అధ్యయనం చేయడమే కాకుండా, ఆ సిద్ధాంతాన్ని ప్రజా జీవితంలో ఆచరణలో పెట్టిన దార్శనికుడు ఏచూరి అని అన్నారు. ప్రజా సమస్యలపై పదునైన వాదన, మార్క్సిజంపై లోతైన అధ్యయనం, ప్రజా ఉద్యమాల పట్ల అచంచలమైన నిబద్ధత ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని తెలిపారు.

రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా అవసరమని ఏచూరి తరచూ చెప్పేవారని తమ్మినేని గుర్తుచేశారు. ప్రతి వ్యక్తికి ఓటు విలువ సమానంగా ఉండటంతో పాటు జీవితం, శ్రమ, హక్కులు, అవకాశాలకు కూడా సమాన విలువ ఉండే సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికవర్గ సాధికారత, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ, యువతకు విద్య–ఉపాధి, ప్రభుత్వ నిధులతో నాణ్యమైన విద్య, ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత వంటి అంశాలపై ఏచూరి ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించారని తెలిపారు.

ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం, లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడటమే సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని తమ్మినేని అన్నారు.

లౌకిక విలువల రక్షణ కోసం పోరాడిన నేత

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశాన్ని, లౌకిక విలువలను కాపాడటంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ ఏచూరి దిక్సూచిగా వ్యవహరించారని పేర్కొన్నారు.

పార్లమెంటులో, పార్లమెంటు వెలుపల ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడిన యోధుడు ఏచూరి అని అన్నారు. విద్యార్థి దశలోనే ప్రధానమంత్రిని ప్రశ్నించిన గొప్ప పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం పొంచి ఉందని బండారు రవికుమార్ అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏచూరి తుది శ్వాస వరకు పోరాడారని, లౌకిక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, లౌకిక విలువల పరిరక్షణ కోసం ఏచూరి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, అన్నవరపు సత్యనారాయణ, ఎం.జ్యోతి, ఎం.బి.నర్సారెడ్డి, కారం పుల్లయ్య, కె.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, ఎస్.ఏ.నబి, దొడ్డ రవికుమార్, గడ్డం స్వామి, నిమ్మల వెంకన్న, వీర్ల రమేష్, పద్మ చిలకమ్మ, కొండబోయిన వెంకటేశ్వర్లు, భూక్య రమేష్, కోబల్ సాంబశివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM