Palvancha: అనుమతి లేకుండా 32 విద్యుత్ స్తంభాల ఏర్పాటు ? వైల్డ్ లైఫ్ శాఖ నోటిసులు
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బంజరలో వైల్డ్‌లైఫ్ అనుమతులు లేకుండా 32 విద్యుత్ స్తంభాలు నాటడం వివాదాస్పదమైంది.
Palvancha: అనుమతి లేకుండా 32 విద్యుత్ స్తంభాల ఏర్పాటు ? వైల్డ్ లైఫ్ శాఖ నోటిసులు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని వైల్డ్‌లైఫ్ ప్రాంతంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాటు చేసిన 32 విద్యుత్ స్తంభాలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
వైల్డ్‌లైఫ్ శాఖ అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని పేర్కొంటూ సంబంధిత NPDCL అధికారులకు వైల్డ్‌లైఫ్ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ లైన్లు, స్తంభాల ఏర్పాటు చేపట్టామని, తమకు అవసరమైన అనుమతులు ఉన్నాయని NPDCL అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో, దాదాపు 15 రోజుల పాటు పనులు కొనసాగినా సంబంధిత వైల్డ్‌లైఫ్ బీట్ ఆఫీసర్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ఇవ్వకపోతే విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? లేక సమాచారం ఇచ్చినా తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. శాఖల మధ్య సమన్వయం లోపించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం రైతుల నుంచి వేల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే, వాటి ఏర్పాటుకు అయిన ఖర్చుతో పాటు తొలగింపు వ్యయం కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై NPDCL సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. మహేందర్‌ను వివరణ కోరగా,వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తానని తెలిపారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైల్డ్‌లైఫ్ శాఖ, NPDCL శాఖల వాదనల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బంజర గ్రామ రైతులు కోరుతున్నారు.




