Sujathanagar: ఎల్ నినో ప్రభావం ఆరుతడి పంటలే వేయాలని భద్రాద్రి కలెక్టర్!
Sujathanagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సుజాతనగర్ మండలంలో పర్యటించారు. ఎల్ నినో దృష్ట్యా వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని ఆదేశించారు.
Sujathanagar: ఎల్ నినో ప్రభావం ఆరుతడి పంటలే వేయాలని భద్రాద్రి కలెక్టర్!
Sujathanagar: సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి, సంక్షేమ, విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగభూపాలెం చెరువును సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 19 అడుగులు కాగా, ప్రస్తుతం 14.5 అడుగుల నీరు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఈ చెరువు ద్వారా సుమారు 2,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, పెసర, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పాత అంజనాపురం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయ పంటలు, పెసర, పత్తి పంటలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కాకరకాయ, సొరకాయ తదితర కూరగాయల సాగును పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వాటి ప్రభావం పంటల సాగుపై పడే అవకాశం తదితర అంశాలను రైతులకు వివరించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగు చేపట్టకుండా తక్కువ నీటితో సాగు చేయగల పెసర వంటి ఆరుతడి పంటలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను చేపట్టాలని సూచించారు. సింగభూపాలెం గ్రామంలో సుమారు 600 ఎకరాల్లో కూరగాయలు, 300 ఎకరాల్లో పెసర సాగు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులకు తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటి అవసరాలను కాపాడుతూ వున్న నీటిని పొదుపు చెయ్యాలన్నారు .అనంతరం సింగభూపాలెం గ్రామంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదటి దశలో గ్రామానికి మొత్తం 32 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 100 శాతం ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయిందని, 11 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తయిన లబ్ధిదారు మిరియాల అరుణ ఇంటిని పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం జరుగుతున్న సర్వేను పరిశీలించారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో మొత్తం 220 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 92 దరఖాస్తుల సర్వే పూర్తయిందని, ఇందులో 61 పూరి గుడిసెలకు సంబంధించిన సర్వే పూర్తయిందని అధికారులు వివరించారు.
మొత్తం దరఖాస్తుల్లో 10 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేలో పూర్తి పారదర్శకత పాటిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల మేరకు రెండో విడత ఇందిరమ్మ ఇంటి పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం సింగభూపాలెం గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద రూ.49 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సంప్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 60 శాతం మేర తాగునీటి సరఫరా జరుగుతోందని, ప్రతి ఇంటికి 100 శాతం సురక్షితమైన తాగునీరు అందించేందుకు సంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
గ్రామంలో రోజుకు సుమారు 2 లక్షల లీటర్ల తాగునీరు అవసరమవుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సంప్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా ముందస్తు ప్రణాళికతో తాగునీటి కనెక్షన్లు కల్పించాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరో తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, బోధన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ పఠన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు.
విద్యార్థుల పఠన సామర్థ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని ఆదేశించారు. తాను మరో నెల రోజుల్లో తిరిగి పాఠశాలను సందర్శిస్తానని, అప్పటికి విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, గణితంలో స్పష్టమైన పురోగతి సాధించేలా చర్యలుu తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అనంతరం వేపలగడ్డ గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించి విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. అనంతరం పాఠశాల వంటగదిని పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
ప్రతిరోజూ అవసరమయ్యే బియ్యం, ఇతర సరుకుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వసతి గృహ పరిసరాలు, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ అంకిత్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్ బాబు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏవోలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సర్వే బృందాల సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.




