Kothagudem: ఐలమ్మ స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ఉధృతం చేయాలి: సీఐటీయూ!
Kothagudem: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ పిలుపునిచ్చారు.
Kothagudem: ఐలమ్మ స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ఉధృతం చేయాలి: సీఐటీయూ!
కొత్తగూడెం: వెన్నుచూపని ధీరత్వం, మడమ తిప్పని కమ్యూనిస్టు వారసత్వానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్‌లో కార్మిక వర్గ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల పని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
భూక్తి, భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యం ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని భూక్య రమేష్ పేర్కొన్నారు. తన భూమిలో పండించిన పంటను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన నైజాం పాలకులకు వ్యతిరేకంగా, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అండతో ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.
ఐలమ్మను, ఆమె కుటుంబాన్ని నైజాం మూకలు తీవ్రంగా వేధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో ఎంతోమంది కౌలు రైతులు, పేద రైతులు నైజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి వచ్చారని తెలిపారు.
నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగానే భూమి, పేదల సమస్యలు నేటికీ పాలకుల ఎజెండాలో కొనసాగుతున్నాయని, ఇది కమ్యూనిస్టు ఉద్యమాల విజయమని అన్నారు. ఐలమ్మతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా కమిటీ కార్యదర్శి శివ, నాయకులు నాగేశ్వరరావు, భాస్కర్‌తో పాటు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.




