Bhadrachalam: భద్రాచలంలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ నిరసన!

Bhadrachalam: భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్‌ఎస్‌వి తీవ్ర నిరసన జీవో 97 రద్దు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2026 12:36 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ నిరసన!

Bhadrachalam: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తున్న తీరుపై ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో, భద్రాచలంలో నిరసన సెగలు మిన్నంటాయి.

భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిన వివాదాస్పద జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే బేషరతుగా రద్దు చేయాలి.

గత కొంతకాలంగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలి. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి.

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను గద్దెనెక్కాక కాంగ్రెస్ విస్మరించిందని బీఆర్‌ఎస్‌వీ నాయకులు మండిపడ్డారు.విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే సహించేది లేదని, డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story