Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ 'వంటావార్పు' నిరసన

Kothagudem: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'వంటావార్పు' నిరసన నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Sept 2026 7:51 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ 'వంటావార్పు' నిరసన

కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల్లో అనేక హామీలు అమలు కాలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్ల ఖర్చు వంటి హామీలు కూడా నెరవేరలేదన్నారు.

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు విదేశీ విద్యకు దూరమవుతున్నారని రవిచంద్ర అన్నారు. శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆమె కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు, అన్న శివరాంకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో మాట్లాడి అవసరమైన మొత్తాన్ని సాధించామని ఎంపీ తెలిపారు. కొత్తగూడెంలో నిషేధిత జాబితాలో ఉన్న 444, 666, 817, 999, 727 సర్వే నంబర్ల భూములకు విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు విసిగిపోయారని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని రవిచంద్ర స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం అందరూ కలిసి నేలపై కూర్చొని భోజనాలు చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story