Sathupalli: పిడమర్తి రవి విమర్శలపై మండిపడ్డ బీఆర్ఎస్!
Sathupalli: సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది.
Sathupalli: పిడమర్తి రవి విమర్శలపై మండిపడ్డ బీఆర్ఎస్!
Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి రవి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని.. సండ్రకు సంబంధం లేని అంశాలను ఆయనకు, ఆయన కుటుంబానికి ఆపాదిస్తూ మాట్లాడటం తగదని మండిపడ్డారు. సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడమర్తి రవికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలను రాజకీయంగా వాడుకుని సండ్రను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు, న్యాయస్థానాలు దర్యాప్తు చేస్తాయని.. సంబంధం లేని నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేశారు.
నీకున్న నలుపును తీసుకుని అందరికీ అంటించాలని చూడటం కరెక్ట్ కాదు.. వ్యక్తిగత దూషణలకు దిగితే మాక్కూడా మాట్లాడటం వచ్చు అంటూ పిడమర్తి రవిని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
కుటుంబ సభ్యుల గురించి రాజకీయ విమర్శల్లో ప్రస్తావించడం సరికాదని.. కుటుంబాల జోలికి వెళ్తే ఇరువైపులా వ్యక్తిగత అంశాలు ప్రస్తావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పిడమర్తి రవి గతంలో ఎవరితో తిరిగారు, ఎవరితో సంబంధాలు కొనసాగించారు అనే విషయాలు తమకు తెలుసని.. అయితే వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం తమ ఉద్దేశం కాదన్నారు.
సండ్ర వెంకట వీరయ్యపై విమర్శలు చేసి రాజకీయంగా ఫేమస్ అవ్వాలని చూస్తే అది పొరపాటేనని అన్నారు. రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలపై ఉండాలి కానీ వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదని హితవు పలికారు.
రెండుసార్లు సండ్ర వెంకట వీరయ్యపై పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన పిడమర్తి రవికి.. సండ్ర రాజకీయ స్థాయిని ప్రశ్నించే ముందు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే దానికి ఆ పార్టీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేస్తామా అని ప్రశ్నించారు. వ్యక్తిగత చర్యలకు వ్యక్తులే బాధ్యత వహించాలే తప్ప.. రాజకీయ కక్షతో కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణను వ్యక్తిగత విమర్శలతో తగ్గించలేరని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సండ్రపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఇకనైనా పిడమర్తి రవి వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి.. రాజకీయ అంశాలపైనే మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు.




