Kothagudem: గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి.. ఎస్పీ రోహిత్ రాజు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ఎస్పీ రోహిత్ రాజు కీలక మార్గదర్శకాలు. ఆన్లైన్ నమోదు, డీజేలపై నిషేధం తప్పనిసరని హెచ్చరిక.
Kothagudem: గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి.. ఎస్పీ రోహిత్ రాజు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో మండప వివరాలను నమోదు చేసి, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు వివరాలు అందజేయాలని ఎస్పీ తెలిపారు. ప్రధాన రహదారులు, ప్రజా రవాణా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, 24 గంటల వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ కనెక్షన్‌కు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరని తెలిపారు.
డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితో నిబంధనలకు లోబడి పరిమిత శబ్దంతో స్పీకర్లు మాత్రమే వినియోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు వినియోగించరాదన్నారు.
నిమజ్జన శోభాయాత్రలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, టపాసులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారులపై వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం చేయొద్దని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, సమస్యాత్మక వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ రోహిత్ రాజు ప్రజలను కోరారు.




