Kothagudem: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42 బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు.
Kothagudem: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు.
ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లాలో నమోదైన ప్రమాదాలు, బ్లాక్ స్పాట్లు, భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో 42 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు, రహదారి మార్కింగ్ తదితర భద్రతా ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో 349 రోడ్డు ప్రమాదాలు జరగగా 164 మంది మృతి చెందినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ఆగస్టు నెలలోనే 36 ప్రమాదాలు జరిగి 14 మంది మృతి చెందినట్లు తెలిపారు.
అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు గుంతలను పూడ్చివేయాలని, రోడ్ల వెంట పెరిగిన పొదలను తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని సూచించారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా బ్లాక్ స్పాట్లకు సమీపంలోని ఆసుపత్రులను మ్యాపింగ్ చేసి, అంబులెన్స్ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, డీపీఓ అనూష, డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.




