Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా-2026 విడుదల. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచన.
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా–2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు ఆయన తెలిపారు. సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) కార్యాలయాల పరిధిలో కూడా ముసాయిదా ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు .
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27 మండలాలు ఉన్నాయని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 8,63,413 మంది జనరల్ ఎలక్టర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వీరిలో 4,19,558 మంది పురుషులు, 4,43,805 మంది మహిళలు, 50 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. అదేవిధంగా 28 మంది NRI ఎలక్టర్లు, 723 మంది సర్వీస్ ఓటర్లు నమోదై ఉన్నారని, అన్ని కేటగిరీలను కలిపి జిల్లాలో మొత్తం 8,64,164 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 110-పినపాక (ST) నియోజకవర్గంలో 1,74,854 మంది జనరల్ ఎలక్టర్లు, 2 మంది NRI ఎలక్టర్లు, 197 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 111-ఇల్లెందు (ST) నియోజకవర్గంలో 1,94,860 మంది జనరల్ ఎలక్టర్లు, 4 మంది NRI ఎలక్టర్లు, 274 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 117-కొత్తగూడెం నియోజకవర్గంలో 2,15,639 మంది జనరల్ ఎలక్టర్లు, 14 మంది NRI ఎలక్టర్లు, 152 మంది సర్వీస్ ఓటర్లు, 118-అశ్వారావుపేట (ST) నియోజకవర్గంలో 1,44,770 మంది జనరల్ ఎలక్టర్లు, 6 మంది NRI ఎలక్టర్లు, 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 119-భద్రాచలం (ST) నియోజకవర్గంలో 1,33,290 మంది జనరల్ ఎలక్టర్లు, 2 మంది NRI ఎలక్టర్లు, 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఓటరు పేరు జాబితాలో లేకపోవడం, ఓటరు వివరాల్లో ఏదైనా తప్పు లేదా పొరపాటు ఉండటం, అర్హత లేని వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం వంటి అంశాలను గుర్తించినట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను 17.08.2026 నుంచి 16.09.2026 వరకు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులో సంబంధిత ERO/AERO అధికారులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్పు, తొలగింపు లేదా వివరాల సవరణకు సంబంధించి అవసరమైన దరఖాస్తులను సంబంధిత ERO/AERO/BLOలను సంప్రదించి సమర్పించాలని సూచించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేకపోవడం, ఓటరు వివరాల్లో ఏదైనా తప్పు ఉండటం లేదా అర్హత లేని వ్యక్తి పేరు నమోదై ఉండటం వంటి అంశాలపై ప్రజలు నిర్ణీత గడువులో అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అవసరమైన సహాయం కోసం సంబంధిత ERO/AERO/BLOలను సంప్రదించవచ్చని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఓటర్ల వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, అవసరమైన సందర్భాల్లో నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించాలని ఆయన కోరారు.




