Kothagudem: భద్రాద్రి కలెక్టరేట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు!
Kothagudem: కలెక్టరేట్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ అంకిత్ మరియు ఉన్నతాధికారులకు చిల్డ్రన్ హోమ్ బాలికలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Kothagudem: భద్రాద్రి కలెక్టరేట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు!
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ హోమ్ బాలికలు జిల్లా కలెక్టర్ గారితో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా సంక్షేమాధికారి కి మరియు ఇతర అధికారులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు బాలికలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి విద్య, భవిష్యత్ లక్ష్యాలు, అభిరుచుల గురించి తెలుసుకున్నారు. బాలికలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ తదితర బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి, దేశానికి విలువైన సంపద అని అన్నారు. ప్రతి బాలికకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించి, వారు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
“బేటీ బచావో – బేటీ పడావో” స్ఫూర్తితో బాలికల రక్షణ, విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. బాలికలు ధైర్యంగా ముందుకు సాగి, ఉన్నత విద్యను అభ్యసించి, తమకు నచ్చిన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
“బాలికను కాపాడుదాం బాలికను చదివిద్దాం బాలిక ఎదుగుదలకు తోడ్పడదాం” అనే సందేశంతో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల భద్రత, విద్య, భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
రక్షాబంధన్ సందర్భంగా చిల్డ్రన్ హోమ్ బాలికలు అధికారులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరి నుంచి తమకు అండగా ఉంటుందనే భరోసాను పొందారు. ఈ కార్యక్రమం బాలికల్లో ఆత్మవిశ్వాసం, భద్రతా భావం, కుటుంబ అనుబంధం పెంపొందించేలా ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమం లో హబ్ మిషన్ కోఆర్డినేటర్ సంతోష రూప , స్వాతి , ప్రియాంక , మౌనిక , దీప్తి , చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వినోద్ మరియు బాలికలు పాల్గొన్నారు.




